Mobile Popup Ad
Mobile Popup Ad

బోగస్ ఉద్యోగుల ఏరివేతకు సర్కార్ ప్లాన్

కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వంలో (Telangana Govt) వివిధ విభాగాల్లో ఉద్యోగులను సరఫరా చేసే ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు (Outsourcing Agencies) విధిగా ఆన్‌లైన్ ద్వారా రెన్యూవల్ చేసుకునేలా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఆయా ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు సప్లై చేసే ప్రతీ ఉద్యోగి బయోమెట్రిక్ వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చాల్సిందేనని ఆర్థిక శాఖ నిబంధనలు విధించింది. ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో ప్రభుత్వ విభాగాల్లో చేరే ఉద్యోగులంతా విధిగా ఆన్‌లైన్‌లో వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా డీటెయిల్స్ లాంటివి అప్‌లోడ్ చేయాలని సూచించింది. ఈ కేటగిరీ ఉద్యోగుల వివరాలన్నీ ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ కావడం ద్వారా ప్రతి నెలా జీతభత్యాలు, పీఎఫ్, ఈఎస్ఐ తదితరాలన్నీ పకడ్బందీగా స్టోర్ అవుతాయని, ఎలాంటి ఇబ్బంది సమయానికి క్రెడిట్ అవుతాయని ఆర్థిక శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఆన్‌లైన్‌లో వివరాలుంటే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల లెక్కలు కూడా పక్కాగా ఉంటాయని, వారికి చెల్లించే జీతభత్యాలన్నీ చిన్నపాటి తేడా లేకుండా పారదర్శకత నెలకొంటుందని వివరించారు.

ఎందుకోసం ఈ కొత్త మెకానిజం ?

ప్రజాధనం దుర్వినియోగాన్ని అరికట్టడంలో భాగంగా ఖజానా నుంచి ప్రతి నెలా వేతనాల రూపంలో విడుదలయ్యే నిధులు దారి తప్పకూడదనే చర్యల్లో భాగంగా రాష్ట్ర ఆర్థిక శాఖ సుదీర్ఘ కసరత్తు చేసి ఈ నూతన వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. బోగస్ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఏరివేతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, అనుబంధ విభాగాల్లో పనిచేసే ఈ కేటగిరీ ఉద్యోగుల వివరాలను రాష్ట్ర ఆర్థిక శాఖ గతంలోనే సేకరించింది. దాదాపు పాతికవేల మందికి పైగా కేవలం రికార్డుల్లోనే ఉన్నారని, ఫిజికల్‌గా విధుల్లో లేరని కమిటీల అధ్యయనంలో తేలింది. దాదాపు ఏడేండ్లుగా బోగస్ ఉద్యోగులు పనిచేస్తూ ప్రతి నెలా జీతాలు అందుకోవడం ద్వారా ప్రభుత్వానికి ప్రతి ఏటా సుమారు రూ. 600 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, ఇప్పటివరకు దాదాపు రూ. 4000 కోట్లకు పైగా ప్రజాధనం దారితప్పినట్లు తేలింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ నూతన మెకానిజం ఉనికిలోకి వచ్చింది.

ఇకపైన అవవకతవలకు చెక్

ఔట్ సోర్సింగ్ (Outsourcing Agencies) ఉద్యోగుల వ్యవహారంలో ఉమ్మడి రాష్ట్రం నుంచే అనేక అవకతవకలు కొనసాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఏరివేత చర్యలు తీసుకుంటున్నా కంప్లీట్‌గా ఆగిపోలేదు. డేటా తప్పుడుతడకగా ఉండడంతో స్క్రూటినీ ప్రక్రియ ఆశించిన స్థాయిలో జరగలేదు. ఈ ఆరోపణలతో ర్యాండమ్‌గా తనిఖీలు చేపట్టిన ప్రభుత్వం డేటా ప్యూరిఫికేషన్ మీద దృష్టి పెట్టింది. ఒకవైపు ఆర్థికశాఖకు ఆదేశాలు జారీచేస్తూనే మరోవైపు మాజీ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి నేతృత్వంలోని కమిటీకి వెరిఫికేషన్ బాధ్యతలను అప్పజెప్పింది. ఇకపైన ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్న ప్రభుత్వ ఆదేశంతో ఆర్థిక శాఖ ప్రతీ ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ రెన్యూవల్ విధానాన్ని ఆన్‌లైన్ చేయడంతో పాటు రిక్రూట్‌ అయ్యే ప్రతీ ఉద్యోగి వివరాలు కూడా ఆన్‌లైన్‌లోనే ప్రభుత్వానికి చేరాలనే విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో అధికారులు, ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల నిర్వాహకులు కుమ్మక్కై ప్రజాధనాన్ని కాజేసే ఆటలకు ప్రభుత్వం చెక్ పెట్టినట్లయింది.

Read Also: బీఆర్ఎస్ ప్లీనరీపై సస్పెన్స్.. కవిత కొత్త పార్టీ ఎఫెక్ట్ !!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>