కలం/ఖమ్మం బ్యూరో: డిసెంబర్ 20లోపు ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్‌కోర్టులో (Fast Track Court) తాత్కాలిక పద్ధతిన పని చేయుటకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీ రాజగోపాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. చిన్న పిల్లలపై జరిగే అఘాయిత్యాలు, పోక్సో కేసులను ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో పరిష్కరించేందుకు మార్చి 2026 వరకు తాత్కాలిక పద్ధతిన స్పెషల్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో పని చేసేందుకు అర్హత గల సీనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్‌ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని చెప్పారు.
ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్‌కోర్టులో (Fast Track Court) సీనియర్ అసిస్టెంట్‌కు నెలకు 22,750/- రూపాయలు, ఆఫీస్ సబార్డినేట్‌కు నెలకు 15,600/- రూపాయలు వేతనం అందిస్తామన్నారు. రిటైర్డ్ జ్యుడీషియల్ ఉద్యోగులు, ఇతరఅర్హులు కూడా కాంట్రాక్ట్ పద్ధతిన నియామకాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులు దరఖాస్తు చేసుకునే పక్షంలో వారికి 65 సంవత్సరాలు నిండటానికి వీలు లేదని, తెలంగాణ మినిస్టీరియల్ సర్వీసులలో పదవి విరమణ పొందిన వారికి మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హత ఉందని అన్నారు.
రిటైర్మెంట్ పొందిన జ్యుడీషియల్ సిబ్బంది దరఖాస్తు చేసుకోని పక్షంలో జనరల్ అభ్యర్థులకు అవకాశం లభిస్తుందని, వీరికి వయసు 18 నుంచి 34 లోపు ఉండాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు సడలింపు ఉంటుందని అన్నారు. సీనియర్ అసిస్టెంట్ పోస్ట్‌కు ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలని, ఓఎస్ పోస్ట్‌కు 7 నుంచి 10వ తరగతి వరకు ఏదైనా ఒకటి ఉండాలని, 10 కంటే ఎక్కువ చదివిన వారిని ఎంపిక చేయరని, డ్రైవింగ్ ఎలక్ట్రికల్ ప్లంబింగ్, కుకింగ్ వంటి నైపుణ్యత ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అన్నారు.
బయటవారి నుంచి 20 కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే మెరిట్ ప్రకారం షార్ట్ లిస్ట్ చేసి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 20 సాయంత్రం 5.00 గంటలలోపు దరఖాస్తులు సమర్పించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Read Also: గ్లోబల్ సమ్మిట్ యాడ్ ఖర్చు రూ. 30 కోట్లు
Follow Us On: Youtube


