Mobile Popup Ad
Mobile Popup Ad

రికార్డు స్థాయిలో మొక్కజొన్న కొనుగోళ్లు.. రైతుల సంబురాలు

కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల కొనుగోళ్లు సకాలంలో జరగడం లేదంటూ రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.  ఖమ్మం జిల్లా వెంకటాయపాలెంలో అందుకు విరుద్ధంగా రికార్డు స్థాయిలో కొనుగోళ్లు జరగడంతో రైతులు సంబురాలు జరుపుకున్నారు. రైతులు పండించిన ధాన్యం నిల్వల్లోనే ఉండిపోకుండా, చివరిగింజ వరకు కొనుగోలు చేస్తామన్న తమ హామీని ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. ఈ కొనుగోళ్ల ప్రక్రియను విజయవంతం చేయడంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల (Khammam) నాగేశ్వరరావు కీలక పాత్ర పోషించారు. కొనుగోళ్లు సజావుగా సాగేలా ఆయన నిరంతరం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ పర్యవేక్షించారు.

​వెంకటాయపాలెం సొసైటీ పరిధిలో సుమారు రెండున్నర లక్షల బస్తాల మొక్కజొన్నను రికార్డు స్థాయిలో కొనుగోలు చేశారు. సేకరించిన ధాన్యాన్ని గోదాములకు తరలించేందుకు దాదాపు 300 లారీలు, ట్రాక్టర్లను రంగంలోకి దించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా వేగంగా తరలింపు చేపట్టారు. దీనివల్ల రైతులు తమ పంటను విక్రయించేందుకు రోజుల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా పోయింది. కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడంతో రైతులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.

​కొనుగోలు చేసిన మొక్కజొన్నకు సంబంధించిన చెల్లింపులను ఎటువంటి జాప్యం లేకుండా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా పారదర్శకంగా నిధులు అందేలా వ్యవస్థను అమలు చేస్తున్నారు. ప్రతి బస్తాకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర లభిస్తుండటంతో రైతు కుటుంబాలకు పెద్ద ఆర్థిక ఊరట లభించింది.

​మొక్కజొన్న కొనుగోళ్లు విజయవంతంగా పూర్తికావడంతో అల్లిపురం గ్రామంలో రైతులు సంబరాలు జరుపుకున్నారు. బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుంటూ గ్రామమంతా పండుగ వాతావరణాన్ని తలపించింది. తమకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులకు రైతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, వారి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ​ఈ సంబరాల కార్యక్రమంలో వెంకటాయపాలెం సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. రైతుల సంక్షేమం కోసం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేస్తున్న కృషి అభినందనీయమని, భవిష్యత్తులోనూ ఇదే విధంగా తమకు అండగా నిలవాలని వారు ఆకాంక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>