అగ్రిగోల్డ్ బాధితులకు అండగా సీపీఐ.. పశ్య పద్మ హామీ

కలం, కరీంనగర్‌ : శుక్రవారం కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్ల అసోసియేషన్ కరీంనగర్ జిల్లా సమావేశం బండారి జ్యోతి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ (CPI Leader Pasya Padma) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేద మధ్యతరగతి ప్రజలు కష్ట పడి సంపాదించిన డబ్బులను పిల్లల భవిష్యత్తు కు ఉపయోగపడతాయని అగ్రిగోల్డ్ సంస్థలో పెడితే ఆ సంస్థ చేతులెత్తేసిందని దీంతో అగ్రిగోల్డ్ బాధితులు (AgriGold Victims) రోడ్డున పడ్డారని అన్నారు.

ఆ సంస్థ మోసం చేయడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించిన ఫలితంగా కొంతమేరకు బాధితులకు డబ్బులు చెల్లించే బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అగ్రిగోల్డ్ బాధితులు చెల్లించిన డబ్బులు వడ్డీతో సహా చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఈ సంస్థకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే లైసెన్సులు ఇచ్చి ప్రజల్లోకి వదిలాయని, అందుకోసమే ఆ ప్రభుత్వాలు పూర్తి బాధ్యత తీసుకొని అగ్రిగోల్డ్ యజమాన్యం మెడలు వంచి బాధితులకు న్యాయం చేయాలని పద్మ డిమాండ్ చేశారు.

అగ్రిగోల్డ్ సంస్థ వల్ల దోపిడీకి గురైంది కస్టమర్స్ ఏజెంట్లు అని దోపిడీ చేసిన సంస్థలపై అందరూ కలిసికట్టుగా పోరాటాలు చేయాలని, ఏ ప్రభుత్వాలైతే ఇలాంటి మోసపూరిత సంస్థలకు అనుమతులు ఇచ్చారో, ఆర్థిక నేరగాళ్ల కు లైసెన్సు ఇచ్చి ప్రోత్సహించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నైతిక బాధ్యత వహించి కస్టమర్లకు, ఏజెంట్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితులకు ఆ సంస్థ నుండి రావాల్సిన డబ్బులను ఇప్పించేందుకు పాలక ప్రభుత్వాలు ముందుకు రావాలని ఆమె కోరారు.

డబ్బులు వచ్చేంత వరకు కస్టమర్స్,ఏజెంట్లు కలిసికట్టుగా ఉండాలని, కరీంనగర్ జిల్లా అగ్రిగోల్డ్ బాధితుల తరఫున తాము ఎంతటి ఉద్యమానికైనా సిద్ధంగా ఉన్నామని కస్టమర్స్, ఏజెంట్లు కూడా పోరాటాలకు వెనకడువేయవద్దని పద్మ పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్లు బోయిని తిరుపతి, బుడిగ శ్రీనివాస్, బండారి జ్యోతి, బుడిగ నరేష్, తుమ్మ సత్తయ్య, రాపర్తి రవీందర్,పెద్ది అజయ్, పిట్టల కుమారస్వామి, పప్పు రాజు, కొట్టే సంపత్, పప్పు శ్రీనివాస్, వర్షాల సంపత్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>