నెయ్యి పేనీల పేరుతో డాల్డా విక్రయాలు?

కలం, నిర్మల్ : దీపావళి వచ్చిందంటే చాలు.. స్వీట్ల దుకాణాలు, రోడ్డు పక్కన తాత్కాలిక విక్రయ కేంద్రాలు పేనీలతో (Pheni Sales) కళకళలాడుతాయి. పండుగ పూట వేడి వేడి పాలల్లో పేనీలు వేసుకుని తినేందుకు ప్రజలు ఆసక్తి చూపుతారు. ఇదే ఇష్టాన్ని కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మైదా, డాల్డాతో తయారు చేసిన పేనీలపై కొద్దిగా నెయ్యి స్ప్రే చేసి.. శుద్ధమైన నెయ్యితో తయారు చేసినవంటూ విక్రయిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

డాల్డాతో తయారీ.. నెయ్యి పేరుతో అమ్మకాలు..

వ్యాపారుల సమాచారం ప్రకారం హైదరాబాద్‌, నిజామాబాద్‌ ప్రాంతాల్లోని కొన్ని తయారీ కేంద్రాల నుంచి పెద్ద మొత్తంలో పేనీలు నిర్మల్‌ పట్టణానికి సరఫరా అవుతున్నాయి. డాల్డాతో తయారు చేసిన పేనీలకు పసుపు, ఎరుపు రంగులు అద్ది స్థానిక దుకాణాలకు పంపిస్తున్నారు. నిర్మల్‌లోని కొన్ని ప్రొవిజన్‌ స్టోర్లు, స్వీట్‌ హోమ్‌లు అర కిలో, కిలో బాక్సులు తయారు చేసి వాటిపై శుద్ధమైన నెయ్యి పేనీలంటూ ప్రచారం చేస్తూ విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పైన నెయ్యి స్ప్రే చేయడంతో వినియోగదారులు వాటిని అసలైన నెయ్యితో తయారైనవిగా నమ్మే అవకాశం ఉంది. తెల్ల పేనీకి ఒక ధర, రంగులు కలిపిన పేనీలకు మరో ధర, రోస్ట్ పేనీకి ఇంకో ధర అంటూ రకరకాల పేర్లతో విక్రయిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. రంగుల ఆకర్షణకు మోసపోకుండా నాణ్యత, తయారీలో ఉపయోగించిన పదార్థాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

రోడ్లపైనే విక్రయాలు.. దుమ్ము ధూళితో ముప్పు

జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌, ఓల్డ్ బస్టాండ్‌, వివేక్‌ చౌక్‌, శివాజీ చౌక్‌ (ఖానాపూర్ రోడ్డు), ఈద్గాం చౌరస్తా తదితర ప్రాంతాల్లో పేనీల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పండుగను ఆసరాగా చేసుకుని రోడ్ల పక్కనే తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. వాహనాల రాకపోకలతో ఎగసిపడే దుమ్ము, ధూళి బహిరంగంగా ఉంచిన ఆహార పదార్థాలపై పడుతోంది. తయారీ, నిల్వ పద్ధతులతో పాటు అపరిశుభ్ర వాతావరణంలో విక్రయాలు వినియోగదారుల ఆరోగ్యంపై ఆందోళన కలిగిస్తున్నాయి.

అసలు నెయ్యి పేనీలేవో.. కల్తీవో ఎలా గుర్తించాలి?

బయటికి చూడగానే నెయ్యితో తయారు చేసిన పేనీలను, డాల్డాతో తయారు చేసిన వాటిని కచ్చితంగా గుర్తించడం సాధ్యం కాదు. అందుకే విక్రేతలను తయారీ విధానం, ఉపయోగించిన పదార్థాల గురించి అడిగి తెలుసుకోవాలి. ప్యాకెట్లపై తయారీ తేదీ, గడువు తేదీ, పదార్థాల వివరాలు, తయారీదారు సమాచారం పరిశీలించాలి. అనుమానాస్పదంగా ఉన్న, అపరిశుభ్ర పరిస్థితుల్లో విక్రయించే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. కొన్ని దుకాణాల నిర్వాహకులు తమ పేర్లతో బాక్సులు ముద్రించి, పేనీలను ప్యాక్‌ చేసి, నెయ్యి స్ప్రే చేసి శుద్ధమైన నేతి పేనీలుగా ప్రచారం చేస్తున్నట్లు సమాచారం.

అధికారుల తనిఖీలు ఎక్కడ?

పండుగ సీజన్‌లో స్వీట్లు, చిరుతిళ్ల విక్రయాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆహార భద్రత తనిఖీలు కూడా ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది. పేనీల తయారీ కేంద్రాలు, ప్రొవిజన్‌ స్టోర్లు, స్వీట్‌ హోమ్‌లు, రోడ్డు పక్కన విక్రయ కేంద్రాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. డాల్డాతో తయారు చేసిన వాటిని నెయ్యి పేనీలుగా విక్రయిస్తున్నారనే ఆరోపణలపై విచారణ జరిపి, నమూనాలు సేకరించి ప్రయోగశాలలకు పంపించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఇంట్లో తయారు చేసుకున్నవే మేలు..

బయట లభించే పేనీల నాణ్యత, తయారీ విధానంపై సందేహాలు ఉన్న నేపథ్యంలో ఇంట్లోనే నాణ్యమైన పదార్థాలతో తయారు చేసుకున్న పేనీలు, సేమియాలు తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. పండుగ ఆనందంలో ఆహార నాణ్యతను విస్మరించవద్దని, రూపం చూసి లేదా విక్రేత చెప్పే మాటలు నమ్మి కొనుగోలు చేయకుండా నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>