కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ (Karimnagar) మున్సిపల్ కార్పొరేషన్‌లో రూ. 50 కోట్ల అభివృద్ధి పనుల టెండర్ల వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. 87 పనులకు గాను ఏకంగా 69 పనులకు ఒకే ఒక్క టెండర్ (సింగిల్ టెండర్) దాఖలు కావడం వెనుక భారీ అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ టెండర్లను రద్దు చేయాలంటూ ఈఎన్‌సీకి ఫిర్యాదు కూడా అందింది.
కరీంనగర్ నగరంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 50 కోట్ల నిధులను మంజూరు చేసింది. మున్సిపల్ ఎన్నికలకు ముందే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ నిధులను తీసుకువచ్చారు. గతంలో ఒకసారి టెండర్లు పిలిచి రద్దు చేయగా, ఈసారైనా పారదర్శకంగా పనులు జరుగుతాయని అంతా భావించారు. కానీ ఈ విడత టెండర్ల ప్రక్రియ తీవ్ర అనుమానాలకు తావిస్తోంది.
రింగ్ రాజకీయం!
మొత్తం రూ. 50 కోట్ల విలువైన 87 అభివృద్ధి పనులకు టెండర్లు పిలవగా.. అందులో 69 పనులకు కేవలం సింగిల్ టెండర్లు మాత్రమే దాఖలయ్యాయి. ఒక పనికి అసలు టెండరే పడలేదు. మిగిలిన 17 పనులకు మాత్రమే ఒకటి కంటే ఎక్కువ టెండర్లు వచ్చాయి. సాధారణంగా భారీ పనులకు తీవ్రమైన పోటీ ఉండాల్సి ఉండగా, ఇలా 69 పనులకు ఒకే ఒక్క బిడ్డర్ ముందుకు రావడం వెనుక కాంట్రాక్టర్ల ‘రింగ్’ రాజకీయం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా, కాంట్రాక్టర్ల అసోసియేషన్ ప్రయోజనాల కోసం జరిగిన ఈ సింగిల్ టెండర్లను తక్షణమే రద్దు చేయాలని కాంట్రాక్టర్ పూసల నారాయణస్వామి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ‘ఇంజనీర్ ఇన్ చీఫ్’ (ENC) కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
తలా లక్ష వసూలు.. రూ. 50 లక్షల పంపకాలు!
టెండర్ల ప్రక్రియలో ఎలాంటి సమస్యలు రాకుండా, అధికారులను, స్థానిక నాయకులను మేనేజ్ చేసేందుకు గాను కాంట్రాక్టర్ల సంఘం ఒక్కొక్కరి నుంచి లక్ష రూపాయల చొప్పున వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇలా వసూలు చేసిన రూ. 50 లక్షలను అందరికీ వాటాలుగా పంచి, సింగిల్ టెండర్లకు ఆమోదం ముద్ర వేయించుకోవాలనేది వారి ప్లాన్ అని తెలుస్తోంది. పోటీ లేకపోవడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. టెండర్ ప్రక్రియ నిబంధనల ప్రకారమే జరిగిందా? లేదా తెరవెనుక అక్రమాలు జరిగాయా? అనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఈ వ్యవహారంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఈ టెండర్ల వ్యవహారంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. కాగా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని, ఈ టెండర్ల పూర్తి వివరాలను బహిర్గతం చేయాలని కరీంనగర్ ప్రజలు, విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరి ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.
సింగిల్ టెండర్లను వెంటనే రద్దు చేయాలి : సీపీఐ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్
‘కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో యుఐడిఎఫ్ నిధులతో చేపట్టిన టెండర్లకు సింగిల్ టెండర్లు మాత్రమే దాఖలు అయినందున వెంటనే వాటిని రద్దు చేయాలి. మున్సిపల్ ఎన్నికలకు ముందు మంజూరైన 50 కోట్ల రూపాయల పనులకు టెండర్లు నిర్వహించిన వాటికి ఆమోదం లభించకుండా అడ్డుపడి కాంట్రాక్టర్లు తిరిగి అన్ని డివిజన్లకు ప్రాధాన్యమిస్తున్నారు. ఇలా టెండర్లు నిర్వహిస్తే వాటిలో 87 టెండర్లలో 69 పనులకు సింగిల్ టెండర్ మాత్రమే దాఖలు కావడం చూస్తుంటే మున్సిపల్ కార్పొరేషన్ లో అవినీతి అక్రమాలు జరిగే అవకాశం ఉంది. బల్దియాలో ఎలాంటి టెండర్ల ప్రక్రియ జరిగినా కాంట్రాక్టర్ల పెత్తనం కనబడుతుంది. ఐఏఎస్ అధికారి కమిషనర్ గా ఉన్నప్పటికీ అవినీతి రాజ్యమేలుతుంది’ అని పంజాల శ్రీనివాస్ పేర్కొనారు.
బండి సంజయ్ జోక్యం చేసుకోవాలి : AIFB జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్
’69 రకాల పనులకు కాంట్రాక్టర్లు సిండికేట్ అయి సింగిల్ టెండర్ బిడ్ వేశారు. దీనిని వెంటనే రద్దు చేసి తిరిగి నూతన టెండర్లను పిలవాలి. కరీంనగర్ సుడా లో సింగిల్ టెండర్ పడితే దానిని రద్దు చేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో రూ. 50 కోట్ల అభివృద్ధి పనులకు 69 రకాల పనులకు సింగిల్ టెండర్ పడ్డప్పుడు ఎందుకు రద్దు చేయరు. సూడాలో ఒక పద్ధతి నగరపాలక సంస్థలో ఒక పద్ధతా?. కేంద్ర మంత్రి బండి సంజయ్ జోక్యం చేసుకొని సింగిల్ టెండర్ వ్యవస్థను రద్దు చేయించాలి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న రూ.850 కోట్ల పనులకు కూడా కాంట్రాక్టర్లు ఇదే పద్ధతిలో సిండికేట్ అయి సింగిల్ టెండర్ వేస్తారు. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరుగుతుంది. కాంట్రాక్టర్ సిండికేట్ వ్యవస్థను బద్దలు కొట్టాలి. టెండర్ నిబంధనల అమలు, అర్హత ప్రమాణాలు, బిడ్ ప్రక్రియ పారదర్శకతపై సమగ్ర విచారణ జరపాలి. అధికారుల పాత్రపై కూడా పూర్తిస్థాయిలో విచారణ చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’ అని బండారి శేఖర్ విజ్ఞప్తి చేశారు.
న్యాయ విచారణ జరిపించాలి – సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం
‘కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 89 పనులకు టెండర్ వేయగా 69 పనులకు సింగిల్ టెండర్ రావడం వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి. రూ. 50 కోట్ల రూపాయలు గోల్మాల్ చేసేందుకు బీజేపీ కార్పొరేటర్లు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి, అంతా కలిసి కుమ్మక్కై ప్రభుత్వాదాయానికి గండి కొట్టే విధంగా వ్యవహరించారు. ఇతరులను టెండర్లు వేయకుండా అడ్డుపడ్డారు. మున్సిపల్ కమిషనర్ న్యాయవిచరణ జరిపించాలి. కాంట్రాక్టర్ల యూనియన్ రూ.50 లక్షలు పోగేసుకొని సంబంధిత అధికారులను ప్రభావితం చేశారు. ఇప్పటికైనా ఐఏఎస్ అధికారి మున్సిపల్ కమిషనర్ న్యాయవిచారణ జరిపించి టెండర్లు తిరిగి నిర్వహించాలి’ అని అని సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం డిమాండ్ చేశారు.

