epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

పురపోరులో రెబల్స్ బెడద.. ప్రధాన పార్టీల్లో టెన్షన్..!

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు (Municipal Elections) దగ్గర పడుతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ ఎస్, బీజేపీలు కసరత్తు మొదలుపెట్టాయి. పంచాయతీ ఎన్నికలకు పార్టీ గుర్తులతో సంబంధం లేదు కాబట్టి.. చాలా గ్రామాల్లో ఒకే పార్టీకి చెందిన ఎక్కువ మంది పోటీ చేశారు. ఈ రెబల్స్ వల్ల కాంగ్రెస్, బీఆర్ ఎస్ మద్దతిచ్చిన చాలా మంది ఓడిపోయారు. కాంగ్రెస్ రెబల్స్ 800 మంది సర్పంచులు అయ్యారు. అటు బీఆర్ఎస్ రెబల్స్ కూడా చాలా మంది సర్పంచ్‌లుగా గెలిచారు. బీజేపీకి గ్రామాల్లో రెబల్స్ బెడద పెద్దగా లేదు. కానీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఈ రెబల్స్ వల్ల పార్టీ గుర్తులపై పోటీ చేసేవాళ్లకు ఇబ్బందులు తప్పవు.

కాంగ్రెస్ తరఫున ఒక్కో స్థానం నుంచి ఆరుగురు లేదా అంతకంటే ఎక్కువ మందే టికెట్లు ఆశిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో (Municipal Elections) కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఫోకస్ పెట్టి చాలా ఊర్లలో ఏకగ్రీవాలు లేదా పార్టీ తరఫున ఒక్కరే పోటీ చేసేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అది కొంత వరకు మంచి ఫలితాలనే ఇచ్చింది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంతర్గత సర్వే చేయించాలని చూస్తోంది. ముందుగా ఒక్కో స్థానం నుంచి ఆశావహుల లిస్టు తెప్పించుకుని.. వారిపై జనాల్లో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయనే సర్వే చేయబోతున్నట్టు సమాచారం. సర్వే ఫలితాల ఆధారంగా టికెట్లు కేటాయించి మిగతా వారిని బుజ్జగించే బాధ్యతలను ఆయా మున్సిపల్ పరిధిలోని ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ ఛార్జులకు అప్పగిస్తోంది అధిష్టానం. కానీ పార్టీలో పదేళ్లుగా ఎలాంటి పోస్టులు లేకుండా ఉన్న వారు ఎక్కువగానే ఉన్నారు. పైగా బీఆర్ఎస్, బీజేపీ నుంచి గతంలో గెలిచి రీసెంట్‌గా కాంగ్రెస్ లోకి వచ్చిన వారు కూడా టికెట్లు ఆశిస్తున్నారు. కాబట్టి రెబల్స్ ను బుజ్జగించడం నేతలకు పెద్ద సవాల్ గానే మారేలా ఉంది. వారికి ప్రత్యేకమైన హామీలు ఇస్తారా లేదంటే లైట్ తీసుకుంటారా అనేది కూడా తెలియదు.

బీఆర్ఎస్ నుంచి పంచాయతీ ఎన్నికల్లో రెబల్స్ ఎక్కువగా పోటీ చేశారు. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలనేదానిపై కసరత్తు జరుగుతున్నది. గులాబీ పార్టీ నుంచి కూడా ఆశావహుల లిస్ట్ భారీగానే ఉంది. సర్వే చేయించి గెలిచే అవకాశమున్నవారికే టికెట్లు ఇవ్వాలని భావిస్తున్నది. రెబల్ అభ్యర్థులతో ఓటు బ్యాంక్ చీలి ప్రత్యర్థికి కలిసొస్తుందనే భావనతో కంట్రోల్ చేయాలని భావిస్తున్నది. అవసరమైతే ఇతర రూపాల్లో ప్రయోజనం కలిగేలా హామీలు ఇవ్వడానికి అధిష్టానం రెడీ అవుతున్నది.

బీజేపీకి ఈ ఎన్నికలు సవాలుగా మారాయి. అర్బన్‌లో బలమైన పట్టు ఉందని చెప్పుకుంటున్న బీజేపీకి మున్సిపల్ పోరులో రెబల్స్ బెడద తప్పేలా లేదు. గ్రామాల్లో పార్టీకి బలం లేనందున రెబల్స్ బెడద లేదని ఓపెన్‌గానే కేడర్ చెప్పుకున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో టికెట్లు ఆశించి భంగపడిన లీడర్లను లాగేసుకోవాలని భావిస్తున్నది. రెండు మూడు నెలల్లో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయావకాశాలను ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ప్రభావితం చేయాలన్నది బీజేపీ అభిప్రాయం. పట్టణ స్థానిక సంస్థల ఓటర్లను మోడీ ఇమేజ్‌తో ఆకర్షించేందుకు ప్లాన్ చేస్తున్నది.

Read Also: భారత్​పై భారీ ఉగ్ర కుట్ర.. మసూద్​ అజార్​ ఆడియో లీక్​

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>