కలం, వెబ్డెస్క్: పౌరుడు న్యాయం కోసం మొదట అడుగుపెట్టేది జిల్లా కోర్టుల్లోనే అని, అవే అసలైన న్యాయ వేదికలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ (CJI Surya Kant) అన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయాధికారిగా నియమితులైనందుకు ఆయనను సోమవారం ఢిల్లీ హైకోర్టు ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ది బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీ(బీసీడీ) సత్కరించింది. అనంతరం జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడారు. లా కోర్సు చదువుతున్న విద్యార్థులు జిల్లా స్థాయి కోర్టుల్లో తమ ప్రాక్టీస్ మొదలుపెట్టాలని ఆయన సూచించారు. ప్రాక్టీస్ హైకోర్ట్ లేదా సుప్రీంకోర్టులోనే చేయాలనే భావన వాళ్లలో పాతుకుపోయిందని, అది వదిలేయాలని చెప్పారు.
‘దేశంలో జిల్లా కోర్టులను లోయర్ కోర్ట్స్(దిగువ స్థాయి కోర్టులు)గా పిలవడం సరైంది కాదు. స్వతంత్ర న్యాయవ్యవస్థలో అవి ఎంతో కీలకమైన అవయవాలు. అప్పీలేట్ ఫోరాల కంటే కూడా ఎంతో ముఖ్యపాత్రను పోషిస్తున్నాయి. జిల్లా కోర్టులే అసలైన న్యాయవేదికలు. ఎందుకంటే.. పౌరుడు న్యాయం కోసం మొదట అడుగు పెట్టేది జిల్లా కోర్టుల్లోనే. అక్కడే అసలైన న్యాయం దొరుకుతుంది. అందుకే, న్యాయ విద్య ప్రాక్టీస్ కోసం విద్యార్థులు జిల్లా స్థాయి కోర్టులను ఎంచుకునేలా ప్రోత్సహించాలి. దీనిపై హైకోర్టు, సుప్రీంకోర్టు తమ వంతు బాధ్యత నిర్వహించాలి’ అని సీజేఐ సూర్యకాంత్ (CJI Surya Kant) అన్నారు.
జిల్లా కోర్టులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పోల్చిన సీజేఐ.. ‘న్యాయం కోరుకునే వ్యక్తికి జిల్లా కోర్టుల్లోనే పరిష్కారం దక్కితే, అతడు హైకోర్టు లేదా సుప్రీంకోర్టు లాంటి పెద్దాసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదు. ట్రామా సెంటర్కు వెళ్లే పరిస్థితి అసలే రాదు’ అని వ్యాఖ్యానించారు.


