ఆస్ట్రేలియా టూర్‌కు టీమిండియా రెడీ అవుతోంది. ఈ సిరీస్‌కు జట్టును కూడా బీసీసీఐ ఫైనల్ చేసింది. ఈ జట్టును చూసిన టీమిండియా ఫ్యాన్స్ షాకయ్యారు. ఇందులో జడ్డూ భాయ్(Ravindra Jadeja) పేరు లేకపోవడమే అందుకు కారణం. జడేజా లేకపోవడం ఏంటి..? బీసీసీఐకి పిచ్చెక్కిందా? అని కూడా కొందరు నెటిజన్లు తమ నిరాశ, అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగారూలను తన బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌తో కంగారు పెట్టగల సత్తా ఉన్న ఏకైక ప్లేయర్ జడేజా అని, అతడు లేకపోతే జట్టులో సోల్(ఆత్మ) ఉండదని కూడా కొందరు అంటున్నారు.
టీమిండియా విజయాల్లో రోహిత్, కోహ్లీ ఎంత పాత్ర పోషించారో.. జడేజా కూడా అంతే కీలకంగా నిలిచాడని, దానిని ఇప్పుడు బీసీసీఐ(BCCI) మర్చిపోవడం సమంజసం కాదని మరికొందరు అన్నారు. జడేజాకు టీమిండియా వన్డే జట్టులో స్థానం దక్కకపోవడంపై వస్తున్న విమర్శలపై తాజాగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్(Ajit Agarkar) క్లారిటీ ఇచ్చాడు. ఇది తాము తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయమని చెప్పారు. జట్టులో బ్యాలెన్స్ కోసమే జడేజాను సెలక్ట్ చేయలేదని వివరించాడు.
‘‘ప్రస్తుతానికి జట్టులో ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్లను ఆసిస్ టూర్‌కు తీసుకెళ్లడం కుదరదు. జడేజా(Ravindra Jadeja) సమర్థుడే, ఆల్‌రౌండర్‌గా అతడికి సాటి లేదు. అతను ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఉన్నాడు. ఎందుకంటే అక్కడి పరిస్థితుల కారణంగా మేము ఆ అదనపు స్పిన్నర్లను తీసుకున్నాం. ఇప్పుడు మేము ఒక్కరికే అవకాశం ఇవ్వగలం. వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్‌లతో జట్టులో బ్యాలెన్స్‌ను కాపాడుకోగలిగాం. ఆస్ట్రేలియాలో మనకు అంతకంటే ఇంకేమీ అక్కర్లేదు. ఉంటుందని కూడా నేను అనుకోవట్లేదు. ఇది మూడు మ్యాచ్‌ల చిన్న సిరీస్.. అందరికీ అవకాశం ఇవ్వడం కుదరదు. దురదృష్టవశాత్తు ఈసారి జడేజాకు అవకాశం ఇవ్వలేక పోయాం అంతే.. అంతకుమించి ఇంకేమీ లేదు. జడేజా టాలెంట్‌ను మర్చిపోయినట్లు కాదు..’’ అని గవార్కర్ వివరించాడు.

