Mobile Popup Ad
Mobile Popup Ad

‘మున్సిపల్ చట్టాలకు బీజేపీ తూట్లు!’

కలం, కరీంనగర్ బ్యూరో: మున్సిపల్ చట్టాలకు బీజేపీ తూట్లు పొడుస్తోందని మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ (Ravinder Singh) ఆరోపించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికలను చట్ట విరుద్ధంగా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం కరీంనగర్ లో సర్ధార్ రవీందర్ సింగ్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మండిపడ్డారు. నగరంలో 66 మంది కార్పొరేటర్లు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనప్పటికీ, వారిని పూర్తిగా పక్కనబెట్టి కో-ఆప్షన్ ఎన్నికలను నిర్వహించడం ప్రజాస్వామ్యానికి తీవ్రమైన అవమానమని అన్నారు.

ప్రొసీజర్ నంబర్ 6 ఫాలో కావడం లేదు

మున్సిపల్ చట్టంలోని ప్రొసీజర్ నెంబర్-6 ఫాలో కావడం లేదని రవీందర్ సింగ్ (Ravinder Singh) ఆరోపించారు. 7 రోజుల్లో స్క్రూటినీ చేసి, అనంతరం 3 రోజుల్లో అభ్యర్థుల పేర్లు, క్యాటగిరీలను అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నప్పటికీ, కరీంనగర్‌లో మాత్రం ఆ ప్రక్రియను పూర్తిగా విస్మరించారని విమర్శించారు. “ఎవరు పోటీ చేస్తున్నారు? వారి అర్హతలు ఏమిటి? కేసులు ఉన్నాయా? ఓటు హక్కు ఉందా? వంటి కీలక వివరాలు కార్పొరేటర్లకు, ప్రజలకు తెలియకుండా ఉంచడం ఎందుకు?” అంటూ ప్రశ్నించారు. కేవలం పత్రికల ద్వారానే 46 మంది పోటీ చేస్తున్నారనే సమాచారం తెలిసిందని, అధికారికంగా మాత్రం ఎలాంటి వివరాలు ఇవ్వకపోవడం అన్యాయమని పేర్కొన్నారు.

కౌన్సిల్ ఎన్నికలా? బీజేపీ అంతర్గత ఎన్నికలా?

“ఇది కౌన్సిల్ ఎన్నికలా… లేక బీజేపీ పార్టీ అంతర్గత ఎన్నికలా?” అంటూ ఆయన ఎద్దేవా చేశారు. కార్పొరేటర్లకు సమాచారం ఇవ్వకుండా మీరే మీరే నిర్ణయించుకుంటే ప్రజాస్వామ్యానికి అర్థమేంటని నిలదీశారు. కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండీ సంజయ్ కుమార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. “ఎన్నికల సమయంలో ‘నా ముఖం చూసి ఓటేయండి’ అన్న మీరు… ఇప్పుడు అదే ప్రజలకు తెలియకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మీ ‘ధర్మమా’?” అని ప్రశ్నించారు. ఇటివలే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో అర్హతలేని అభ్యర్థులు దరఖాస్తు చేయడంతో ఎన్నికలను వాయిదా వేశారని పేర్కొన్నారు. “అక్కడ అమలు చేసే చట్టం ఇక్కడ ఎందుకు అమలు చేయడం లేదు?” అని ప్రశ్నించారు. మున్సిపల్ యాక్ట్-2019 సెక్షన్ 11 ప్రకారం ప్రాతినిధ్యం లేని వర్గాలకు అవకాశం కల్పించాల్సిన నిబంధనలను పూర్తిగా పక్కన పెట్టారని ఆరోపించారు. పూర్తి జాబితాను విడుదల చేయడానికి ఎందుకు భయపడుతున్నారని  ప్రశ్నించారు. “లోపాలు బయటపడతాయనే భయమా?” అంటూ సవాల్ విసిరారు.

న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం

కార్పొరేటర్లకు ఒక్కరోజు ముందే అయినా సమాచారం ఇవ్వకుండా హుటాహుటిన ఎన్నికలు నిర్వహించడం ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచినట్టేనన్నారు. అర్హతలేని వారిని కో-ఆప్షన్ సభ్యులుగా ఎన్నుకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించడంలో వెనుకాడబోమని రవీందర్ సింగ్ హెచ్చరించారు. “మెజారిటీ మీకే ఉంది… ధర్మంగా ఎన్నికలు జరపండి… లేకపోతే సహించం” అని స్పష్టం చేశారు. వెంటనే పూర్తి వివరాలను బహిర్గతం చేసి, రాజ్యాంగబద్ధంగా, మున్సిపల్ చట్టాల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అవసరమైతే ఉద్యమానికి కూడా సిద్ధమని సర్ధార్ రవీందర్ సింగ్ హెచ్చరించారు. జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌లపై కూడా ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు నమ్మకంతో దరఖాస్తులు ఇస్తే, కనీస సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తుచేశారు. పారదర్శకత లేకుండా వ్యవహరించడం ప్రజల్లో మున్సిపల్ వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తుందన్నారు.

Read Also: ‘ RBI కీలక నిర్ణయం.. పేటీఎమ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>