కలం, వెబ్ డెస్క్: ఢిల్లీలో చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో కేంద్ర మంత్రులు, సీజేపీ (CJP) ప్రతినిధుల మధ్య జరిగిన కీలక చర్చలు కొద్దిసేపటి క్రితమే ముగిశాయి. శుక్రవారం కేంద్ర మంత్రి జేపీ నడ్డా (JP Nadda), ఇతర మంత్రులు సీజేపీ ప్రతినిధులతో సుమారు రెండున్నర గంటల పాటు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. చర్చలు సంతృప్తికరంగా మంచి వాతావరణంలో జరిగాయని వెల్లడించారు. అవసరమైతే మరోసారి సమావేశమయ్యేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా సీజేపీ ప్రతినిధులు ప్రధానంగా మూడు డిమాండ్లను కేంద్రం ముందు ఉంచినట్లు జేపీ నడ్డా వివరించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నది వారి మొదటి డిమాండ్ కాగా, అల్లర్ల నేపథ్యంలో విద్యార్థులపై నమోదైన కేసులన్నింటినీ వెంటనే ఎత్తివేయాలని రెండో డిమాండ్‌గా కోరారు. ఇక మూడో డిమాండ్‌గా నీట్ తప్పిదాల కారణంగా చనిపోయిన ప్రతీ విద్యార్థి కుటుంబానికి తలా కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలి. వీటికి తోడు పరీక్షా విధానంలో సమూల సంస్కరణలు తీసుకురావాలంటూ మొత్తం ఐదు రకాల సంస్కరణలను ప్రభుత్వానికి సూచించారని చెప్పారు.
ఈ డిమాండ్లన్నింటినీ తాము వివరంగా విన్నామన్నారు. వీటన్నింటిపై కేంద్ర ప్రభుత్వంతో సమగ్రంగా చర్చించి రాబోయే 24 గంటల్లో తదుపరి సమాచారాన్ని సీజేపీ ప్రతినిధులకు తెలియజేస్తామని మంత్రులు స్పష్టం చేశారు. ఉమ్మడిగా శనివారం మధ్యాహ్నం మరోసారి సమావేశమై ఈ అంశాలపై చర్చించాలని నిర్ణయించారు.

