ఆర్‌సీబీ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్.. అశ్విన్ ఆసక్తికర జోస్యం..!

క‌లం, వెబ్ డెస్క్‌: ఐపీఎల్ (IPL) తొలి మ్యాచ్‌ నుంచి ఉత్కంఠ భరితంగా సాగనుంది. చిన్నస్వామి స్టేడియంలో శనివారం తొలి మ్యాచ్ జరగనుంది. ఇందులో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)తో సన్‌రైజర్స్ హైదరాబాద్‌(SRH) తలపడనుంది. ఈ మ్యాచ్‌ హోరాహోరీగా సాగుతుందని అభిమానులు అంచనాలు వేస్తున్నారు. కాగా తాజాగా ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తార‌న్న అంశంపై టీమిండియా మాజీ పేసర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) కీలక జోస్యం చెప్పారు. చిన్నస్వామి స్టేడయింలో ఆరెంజ్ ఆర్మీ చేతిలో ఆర్‌సీబీ చిత్తయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆరెంజ్ ఆర్మీదే పైచేయి అయ్యేలా కనిపిస్తోందని ఆయన విశ్లేషించారు.

గత రెండు సీజన్ల రికార్డులను పరిశీలిస్తే ఇరు జట్లు సమానంగా ఉన్నప్పటికీ, ఇటీవలి మ్యాచ్‌లలో హైదరాబాద్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ముఖ్యంగా 2024లో బెంగళూరు గడ్డపైనే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించిన రికార్డు ఎస్‌ఆర్‌హెచ్ సొంతం. ఆ సెంటిమెంట్ ఈసారి కూడా కొనసాగుతుందని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో అభిప్రాయపడ్డారు. గతేడాది లక్నోలో జరిగిన పోరులో కూడా హైదరాబాద్ 42 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీకి ప్రస్తుతం బౌలింగ్ సమస్యలు ప్రధాన తలనొప్పిగా మారాయి. స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ గాయంతో దూరం కావడం, యశ్ దయాళ్ వ్యక్తిగత కారణాలతో అందుబాటులో లేకపోవడం ఆ జట్టుకు పెద్ద మైనస్. అటు శ్రీలంక పేసర్ నువాన్ తుషారకు ఇంకా ఎన్ఓసీ (NOC) లభించలేదు. దీంతో భువనేశ్వర్ కుమార్ మినహా అనుభవం ఉన్న బౌలర్లు ఆర్సీబీలో కనిపించడం లేదు. రజత్ పటీదార్ నేతృత్వంలోని బెంగళూరు జట్టు మంగేష్ యాదవ్, రసిఖ్ దార్ వంటి అన్‌క్యాప్డ్ ప్లేయర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది.

చివరి ఓవర్లలో పరుగులు నియంత్రించడం బెంగళూరుకు అసాధ్యమని అశ్విన్ విశ్లేషించారు. వికెట్లు చేతిలో ఉంటే డెత్ ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లను ఆపడం ఎవరికీ సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. బౌలింగ్ వైఫల్యాల కారణంగానే ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ ఆధిపత్యం చెలాయిస్తుందని అశ్విన్ గట్టిగా నమ్ముతున్నారు. మరి అశ్విన్ అంచనాలు నిజమవుతాయా లేదా అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>