కలం, వెబ్ డెస్క్: విజయవాడ ఉగ్ర లింకుల (Vijayawada Terror Links) కేసులో అరెస్టుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఈ కేసులో దేశ వ్యాప్తంగా ప్రధాన పాత్ర పోషిస్తున్న 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. సిటీ పోలీస్ టాస్క్ ఫోర్స్, ఏపీ సీఐ సెల్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి. “అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్” అనే సంస్థ పేరుతో ఆన్‌లైన్ వేదికగా ఐసిస్ (ISIS), ఆకిస్ (AQIS) వంటి ప్రమాదకర భావజాలాలను ప్రచారం చేస్తూ, యువతను రిక్రూట్ చేసుకుంటున్నట్లు ఈ ముఠాపై ఆరోపణలు ఉన్నాయి. ఈ దర్యాప్తులో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఇప్పటి వరకు మొత్తం 12 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
విజయవాడ, హైదరాబాద్, బళ్లారి, ఢిల్లీ, జోధ్‌పూర్, ముంబై, పూణే, బంకురా, ఔరంగాబాద్, దర్భంగా వంటి నగరాల్లో సోదాలు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో మహమ్మద్ రహమతుల్లా షరీఫ్, ఎండీ డానిష్, మీర్జా సోహైల్ బేగ్, సయీదా బేగం, అబ్దుల్ సలాం, లక్కీ అహ్మద్, జిషన్, షేక్ ఫయాజ్ రెహమాన్, షారుఖ్ ఖాన్, మీర్ ఆసిఫ్ అలీ, అజ్మానుల్లా ఖాన్, షాద్మాన్ దిల్ఖుష్ ఉన్నారు. ఈ నెట్‌వర్క్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

