కలం, వెబ్ డెస్క్ : స్టార్ హీరోయిన్ రష్మిక (Rashmika) తన మీద జరుగుతున్న ట్రోలింగ్, ఫేక్ ప్రచారాలపై సీరియస్ గా స్పందించింది. రెండు రోజులుగా తన మీద వస్తున్న ఫేక్ ప్రచారాలకు సంబంధించిన వీడియోలు, ఆడియో రికార్డులను వెంటనే తొలగించాలని.. లేదంటే లీగల్ యాక్షన్ తీసుకుంటానని మీడియా ఛానెళ్లు, యూట్యూబ్ ఛానెళ్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లకు వార్నింగ్ ఇచ్చింది. తన మీద ఎనిమిదేళ్లుగా ఒక వర్గం మీడియా, కొన్ని ఆన్ లైన్ పేజీలలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని.. ఆన్ లైన్ వేధింపులకు పాల్పడుతున్నారంటూ నోట్ రిలీజ్ చేసింది.
ఇందులో ఏముందంటే.. ‘ఎనిమిదేళ్లుగా నా మీద ఇలాంటి ఆన్ లైన్ దాడులు జరుగుతున్నాయి. నేను చెప్పని దాన్ని చెప్పినట్టు క్రియేట్ చేయడం, నేను మాట్లాడిన దాంట్లో కొంత భాగాన్ని ఎడిట్ చేసి తప్పుగా ప్రచారాలు చేయడం జరుగుతోంది. వ్యూస్, రీచ్, ఎంగేజ్‌మెంట్ కోసం నా మీద ఇలా ద్వేషాన్ని బయటపెడుతున్నారు. ఇదంతా నేను గమనిస్తూనే ఉన్నాను. నాకు ఇలాంటివి ఎంతో బాధ కలిగించినా.. నేను ఓపిక పడుతూ వస్తున్నాను. పబ్లిక్ లైఫ్ లో ఉన్నందుకు కొన్ని సార్లు ఇలాంటి అన్యాయమైన విమర్శలు వస్తాయని తెలుసుకున్నాను. కాకపోతే నేను నిజాయితీగా ఉంటూ నా పని చేసుకుంటూ ఎదిగితే ఇవన్నీ సర్దుకుంటాయని నమ్మాను. కానీ గత రెండు రోజులుగా నాపై జరుగుతున్న ఆన్ లైన్ ఫేక్ ప్రచారం మాత్రం లిమిట్ దాటిపోయింది’ అంటూ రష్మిక (Rashmika) చెప్పుకొచ్చింది.
‘ఎనిమిదేళ్ల క్రితం జరిగిన పర్సనల్ సంభాషణను.. అందులో పాల్గొన్న వారికి కూడా తెలియకుండా రికార్డు చేసి బయటకు తీశారు. అందులోని కొంత భాగాన్ని మాత్రమే తీసుకుని కరెక్ట్ గా నా పెళ్లి సమయంలోనే కావాలనే వైరల్ చేస్తున్నారు. ఇది నా వ్యక్తిగత జీవితాన్నే కాకుండా నా కుటుంబాన్ని కూడా ఇందులోకి లాగుతున్నారు. ఇది కచ్చితంగా నా పరువుకు నష్టం కలిగించే అంశమే. ఎనిమిదేళ్లుగా ఇలాంటి వాటిపై నేను మౌనంగా ఉంటున్నాను. కానీ ఇప్పుడు మౌనంగా ఉండలేను. ఆ కంటెంట్ పై కథనాలు ప్రచారం చేస్తున్న మీడియా ప్లాట్ ఫారమ్ లు, ఇన్ ఫ్లుయెన్సర్లు, ఇతర వ్యక్తులు 24 గంటల్లోపు వాటిని తొలగించాలి. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. లీగల్ నోటీసులు పంపిస్తాను’ అంటూ రష్మిక ఫైర్ అయింది.

