కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో రాజకీయ పవనాలు వేగంగా మారుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ్‌చందర్ రావు (Ramchander Rao) అన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ఏకైక బలమైన ప్రత్యామ్నాయ శక్తి బీజేపీ (BJP) మాత్రమేనన్నారు. హైదరాబాద్ లోని రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ‘దీన్ దయాళ్ ప్రశిక్షణ్ అభియాన్’ జిల్లా స్థాయి వర్క్‌షాప్‌ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మండల స్థాయి శిక్షణా తరగతుల ద్వారా ఇప్పటికే 50,000 మందికి పైగా కార్యకర్తలకు శిక్షణ అందించడం పార్టీ సంస్థాగత బలానికి నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణలో ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ స్థాపనే లక్ష్యంగా కార్యకర్తలంతా సరికొత్త ఉత్సాహంతో, నిబద్ధతతో పని చేయాలని పిలుపునిచ్చారు.
ఉద్యోగుల బకాయిలు చెల్లించడానికి మంత్రుల జీతాలు కోస్తామని సీఎం రేవంత్ (CM Revanth Reddy) చెప్పడం కేవలం కపట నాటకమని విమర్శించారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్‌కు కప్పంగా కడుతున్న రూ.1,000 కోట్లను తక్షణమే ఆపి, అందులో కనీసం రూ.500 కోట్లయినా ఉద్యోగుల సంక్షేమ నిధికి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎన్ని కొత్త పార్టీలు పుట్టుకొచ్చినా.. తెలంగాణ కోసం నిలబడి, నిజాయితీగా పోరాడింది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమేనని వ్యాఖ్యానించారు. “బీజేపీకి తెలంగాణలో మంచి వాతావరణం నిర్మాణమైయుంది. కార్యకర్తల ఐక్యత, సిద్దాంతం పట్ల నిబద్ధత, ఉత్సాహంతో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఎవరైనా కూడా పార్టీలు పెట్టుకోవచ్చు. కేఏ పాల్‌కు కూడా పార్టీ ఉంది. ఏ పార్టీ ప్రజల కోసం ఆలోచిస్తుందో ప్రజలు ఆలోచించుకోవాలి. బీజేపీ ప్రజల కోసం ఆలోచిస్తుంది. అవినీతి రహిత పాలనను బీజేపీ అందిస్తుంది” అని ఆయన (Ramchander Rao) అన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ తివారీ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, బీజేఎల్పీ నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, గౌతమ్ రావు, పార్టీ జిల్లా అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Also: మళ్లీ పుట్టిన ‘టీఆర్ఎస్’.. పేరు, జెండా వెనుక కవిత స్ట్రాటజీ ఏంటి?
Follow Us On: Sharechat

