డీకోడ్ మిత్ర’తో ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ విప్లవం

కలం, ఆదిలాబాద్ బ్యూరో : ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. తాము నేర్చుకున్న కంప్యూటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) పరిజ్ఞానాన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బోధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ‘ డీకోడ్ మిత్ర’ ప్రోగ్రామ్ ద్వారా పాఠశాల విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్యాలను పెంపొందిస్తూ, వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారు. ఆదిలాబాద్ (Adilabad) ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కంప్యూటర్, ఏఐ టెక్నాలజీల్లో ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. సాధారణంగా డిగ్రీ పూర్తయ్యాక ఉన్నత విద్య కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లడం లేదా పోటీ పరీక్షలకు సిద్ధమవడం చేస్తుంటారు. అయితే ఇక్కడి విద్యార్థులు తాము నేర్చుకున్న జ్ఞానాన్ని పాఠశాల విద్యార్థులకు పంచుతూ ఇంటర్న్‌షిప్‌లో భాగంగా బోధన చేస్తున్నారు. ఈ శిక్షణలో కంప్యూటర్ బేసిక్స్, ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, ఏఐ టూల్స్, అల్గారిథమ్స్ వంటి అంశాలపై సుమారు 30 గంటల పాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు ల్యాబ్‌లోనే ప్రత్యక్షంగా సాధన చేస్తుండటంతో పాఠాలను సులభంగా అర్థం చేసుకుంటున్నారు. కొందరు విద్యార్థులు నేర్చుకున్న అంశాలను స్వయంగా ప్రదర్శిస్తూ తమ ప్రతిభను చాటుతున్నారు. శిక్షణ పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్లు కూడా అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా..

ఏఐ, కంప్యూటర్ నైపుణ్యాలు నేర్చుకునేందుకు బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా తమ పాఠశాలలోనే ఈ అవకాశం లభించడం ఆనందంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా కంప్యూటర్ బేసిక్స్, ఏఐ టూల్స్ వినియోగం, ప్రోగ్రామింగ్‌కు సంబంధించిన ప్రాథమిక అంశాలను నేర్చుకుంటున్నామని తెలిపారు. ఈ శిక్షణ తమ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని, తమకు బోధిస్తున్న డిగ్రీ విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఏఐ వైపు ప్రభుత్వ పాఠశాలలు

ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో ఏఐ వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఇప్పటి నుంచే ఆ సాంకేతికతపై అవగాహన పెంపొందించుకోవడం అవసరమని విద్యావేత్తలు సూచిస్తున్నారు. అలాంటి సమయంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏఐ, కంప్యూటర్ నైపుణ్యాలు అందించడం ద్వారా వారిని భవిష్యత్తు అవసరాలకు సిద్ధం చేస్తున్నారు.

ప్రిన్సిపాల్ హర్షం

డిగ్రీ విద్యార్థులు పాఠశాల విద్యార్థులకు ఏఐ, కంప్యూటర్ అంశాలను బోధించడం అభినందనీయమని పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు. విద్యార్థులు ఎంతో ఆసక్తితో శిక్షణలో పాల్గొంటున్నారని, కంప్యూటర్, ఏఐ టూల్స్‌పై మంచి అవగాహన పెంచుకుంటున్నారని చెప్పారు. డిగ్రీ విద్యార్థులను ప్రిన్సిపల్ అభినందించారు.

‘డీకోడ్ మిత్ర’గా శిక్షణ

  • ‘డీకోడ్ మిత్ర’ ప్రోగ్రామ్ కింద ఆదర్శ పాఠశాలల్లో డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు కంప్యూటర్ బేసిక్స్, ఏఐ టూల్స్‌పై శిక్షణ.
  • ప్రతి మోడల్ స్కూల్‌లో ఇద్దరు డిగ్రీ విద్యార్థులను ఎంపిక చేసి బోధన బాధ్యతలు.
  • కంప్యూటర్ ల్యాబ్‌లో విద్యార్థులకు థియరీతో పాటు ప్రాక్టికల్ శిక్షణ.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>