కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ్‌చందర్ రావు (Ramchander Rao) తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ చేతిలో కాంగ్రెస్ పార్టీ కీలుబొమ్మగా మారిందని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులకు నిజంగా దమ్ముంటే.. రాష్ట్రాన్ని దోచుకున్న ప్రాజెక్టుల అవినీతిపై సీబీఐ విచారణ జరిపించి బీఆర్ఎస్ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికి క్షేత్రస్థాయిలో ఎప్పుడో గల్లంతైందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఆ పార్టీ కేవలం మీడియా, సోషల్ మీడియాకే పరిమితమైందని చెప్పారు.
ప్రధాని మోదీ సభలు భారీగా విజయవంతమవడం, రాష్ట్రంలో బీజేపీ ఏకైక ప్రత్యామ్నాయంగా బలపడుతుండటం చూసి ఓర్వలేకనే.. ఆ పార్టీ నేతలు మాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పులను సైతం వక్రీకరిస్తూ వారు చేస్తున్న విషప్రచారాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు.
రాష్ట్రంలో బీజేపీని రాజకీయంగా ఎదుర్కోలేక బీఆర్ఎస్ నాయకులు కోట్లు ఖర్చుపెట్టి పోస్టర్లు వేస్తూ బండి సంజయ్ ని టార్గెట్ చేస్తూ ఆయనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇతరులపై బురదజల్లే కేటీఆర్.. 2022 మే నెలలో నిర్మల్ మున్సిపాలిటీలో తమ బీఆర్ఎస్ మైనారిటీ నాయకులు షేక్ పాషా, షేక్ జాన్ లు చేసిన దారుణాలపై అప్పట్లో అధికారంలో ఉన్న మీరు గానీ, కేసీఆర్ గానీ ఏమైనా చర్యలు తీసుకున్నారా? అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ నేతలు ఈరోజు మహిళల హక్కుల గురించి మాట్లాడుతున్నారని రామ్ చందర్ రావు (Ramchander Rao) దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహిళలపై జరిగిన అరాచకాలపై కేసీఆర్ రాజీనామా చేశారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబంలోని ఒక మహిళ సారా దందాలో కోట్లాది రూపాయలు కమీషన్ తీసుకుని జైలుకు వెళ్లిందని.. మరి అది క్రైమే కాదా? మరి కేసీఆర్ ఎందుకు రాజీనామా చేయలేదు? అని ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేసు కేసులో అరెస్టు చేస్తారేమో, కాళేశ్వరం కేసులో ఇరుక్కుంటామనే భయంతో బీజేపీపై బీఆర్ఎస్ విష ప్రచారం చేస్తుందని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలో ఇంటర్మీడియట్ తప్పుడు ఫలితాల వల్ల 29 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని.. ఆ చావులకు కేటిఆరే కారణమని మండిపడ్డారు.
Read Also: ముంబై, అహ్మదాబాద్ హైవేపై రోడ్డు ప్రమాదం.. 12 మంది స్పాట్ డెడ్
Follow Us On: WhatsApp

