కలం, మెదక్ బ్యూరో: రామాయంపేట (Ramayampet) నియోజకవర్గం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రత్యేక ముద్ర ఉన్న ప్రాంతం. నిజాం పాలనలో తాలూకాగా ఉండి, 1952లో హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు జరిగిన మొదటి ఎన్నికల సమయం నుంచే ఇది నియోజకవర్గ కేంద్రంగా సేవలందించింది. 1952లో ఏర్పాటైన ఈ నియోజకవర్గం, 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో రద్దయ్యే వరకు సుమారు ఐదు దశాబ్దాల పాటు తన ఉనికిని చాటుకుంది. నాగపూర్ జాతీయ రహదారి 44ను ఆనుకొని ఉన్న ఈ ప్రాంతం, ఉమ్మడి రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిని కూడా అందించిన ఘన చరిత్రను కలిగి ఉంది. ఇక్కడి ఓటర్లు పార్టీల కంటే అభ్యర్థుల పనితీరుకే ప్రాధాన్యతనిస్తూ విలక్షణ తీర్పులు ఇవ్వడంలో పేరుగాంచారు. అందుకే కాంగ్రెస్, కమ్యూనిస్టు, బీజేపీ, టీడీపీ, టీఆర్ఎస్ వంటి అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులను ఆదరించి శాసనసభకు పంపారు.
చారిత్రక నేపథ్యం, తొలి ఎన్నికలు..
చారిత్రక నేపథ్యాన్ని పరిశీలిస్తే, 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీశ్రీనివాస్ విజయం సాధించారు. అయితే కొన్ని న్యాయపరమైన కారణాలతో ఆయన పదవి కోల్పోవడంతో 1953లో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ ఎన్నికల్లో నల్గొండ జిల్లాకు చెందిన ప్రముఖ తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ఆరుట్ల రామచంద్రారెడ్డి పీడీఎఫ్ అభ్యర్థిగా గెలుపొందారు. తెలుగు రాష్ట్రాల్లోనే మొదటి ఉప ఎన్నిక జరిగిన నియోజకవర్గంగా రామాయంపేట రికార్డుల్లో నిలిచిపోయింది. విచిత్రమైన విషయం ఏమిటంటే, ఈ నియోజకవర్గ ప్రస్థానం 1953లో ఒక ఉప ఎన్నికతో ప్రారంభమై, మళ్ళీ 2008లో జరిగిన ఉప ఎన్నికతోనే ముగిసింది. ఆ తర్వాత 2009 డీలిమిటేషన్‌లో (Delimitation) ఈ నియోజకవర్గం రద్దయి మూడు ముక్కలుగా విడిపోయింది. అప్పటి వరకు ఉన్న రామాయంపేట, చిన్న శంకరంపేట మండలాలు మెదక్ (Medak) అసెంబ్లీలో విలీనం కాగా, కోల్చారం, వెల్దుర్తి మండలాలు నర్సాపూర్ నియోజకవర్గంలోకి, చేగుంట మండలం దుబ్బాక నియోజకవర్గంలోకి వెళ్ళిపోయాయి.
ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించిన ఘనత..
రామాయంపేట చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టం మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య ప్రాతినిధ్యం వహించడం. 1980లో అంజయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆయన ఏ సభలోనూ సభ్యుడిగా లేరు. దీంతో ఆయన కోసం అప్పటి రామాయంపేట ఎమ్మెల్యే ఆర్. ముత్యంరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. 1981లో జరిగిన ఆ ఉప ఎన్నికలో అంజయ్య ఏకగ్రీవంగా ఎన్నికై 16 నెలల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత 1983 ఎన్నికల్లో కూడా అంజయ్య ఇక్కడి నుండే పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించడం గమనార్హం. ఇలా ఒక ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించిన స్థానంగా రామాయంపేటకు రాష్ట్ర రాజకీయాల్లో మంచి గుర్తింపు లభించింది.
మళ్ళీ తెరపైకి నియోజకవర్గ సాధన డిమాండ్..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన అంశం మళ్ళీ చర్చకు రావడంతో రామాయంపేట (Ramayampet) ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయి. నియోజకవర్గ హోదా కోల్పోయిన తర్వాత ఈ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే రామాయంపేట, నిజాంపేట, నార్సింగి, చేగుంట లేదా చిన్న శంకరంపేట మండలాలను కలుపుకొని తిరిగి నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలని నియోజకవర్గ సాధన సమితి సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం పార్టీలకతీతంగా అఖిలపక్షంగా ఏర్పడి పోరాటానికి సిద్ధమవుతున్నారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈ ఉద్యమంలో పాలుపంచుకోవాలని, తమ ప్రాంతానికి పూర్వవైభవం తీసుకురావాలని నాయకులు పిలుపునిస్తున్నారు.
Read Also: సౌత్ వర్సెస్ నార్త్.. ‘ఢీ’ లిమిటేషన్
Follow Us On: Sharechat

