కలం, వెబ్డెస్క్: ఏడాది పొడవునా విమాన టికెట్ రేట్లు నియంత్రించడం సాధ్యం కాదని, అసాధారణ పరిస్థితుల్లో కేంద్రం జోక్యం చేసుకుటుందని పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) అన్నారు. పండుగలు, సెలవు దినాల్లో రేట్లు సహజంగానే పెరుగుతాయని చెప్పారు. దేశంలో విమాన టికెట్ల రేట్లను నియంత్రించాలని కోరుతూ వచ్చిన తీర్మానంపై శుక్రవారం లోక్సభలో మంత్రి మాట్లాడారు. ‘డీరెగ్యులేషన్ (నియంత్రణ లేకపోవడం) అసలు ఉద్ధేశ్యం విమాన రంగం అభివృద్ధి. ప్రపంచంలోని అన్ని అభివృద్ధి చెందిన దేశాల్లోనూ విమానయాన మార్కెట్లో డీరెగ్యులేషన్ విధానం ఉంది. మరిన్ని కంపెనీలు రావడానికి, పోటీ పెరగడానికి ఇది సాయపడుతుంది. మార్కెట్ డీరెగ్యులేషన్ వల్ల సరఫరా, డిమాండ్ సహజంగా పనిచేస్తాయి. ఫలితంగా ప్రయాణికులకే మేలు జరుగుతుంది.
దీని కారణంగానే పండగలు, సెలవు దినాల్లో మాత్రమే టికెట్ రేట్లు పెరుగుతాయి. దుర్గాపూజ, ఓనం, దీపావళి, క్రిస్మస్ వంటి సమయాల్లో ప్రయాణికుల తాకిడి ఎక్కువ కాబట్టి ధరలు ఎక్కువవుతాయి. ఆ తర్వాత తగ్గుతాయి. ఇది సహజ ప్రక్రియ. అయితే, డీరెగ్యులేషన్ కంపెనీల హక్కు కాదు. దానిపై కేంద్రం నియంత్రణ ఉంటుంది. కోవిడ్, ఇటీవలి ఇండిగో సంక్షోభం లాంటి అసాధారణ పరిస్థితుల్లో కేంద్రం కచ్చితంగా జోక్యం చేసుకుంటుంది. టికెట్ రేట్లు నియంత్రిస్తుంది. ఇదే విధానాన్ని ప్రస్తుతం అమలు చేశాం. అయితే, ఏడాది పొడవునా టికెట్ రేట్లపై నియంత్రణ విధించలేం’ అని రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) అన్నారు.
Read Also: జనాభా లెక్కల సేకరణకు రూ. 11,718 కోట్ల కేటాయింపు
Follow Us On: Pinterest


