కలం, వెబ్ డెస్క్ : అహ్మదాబాద్(Ahmedabad) వేదికగా గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) అద్భుత విజయాన్ని నమోదు చేసింది. విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేస్తూ, సొంత గడ్డపై ఆడుతున్న గుజరాత్‌కు షాకిస్తూ అద్భుత విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 55 పరుగులతో శుభారంభం అందించగా, యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ వేగంగా పరుగులు సాధించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ధ్రువ్ జురెల్ 42 బంతుల్లో 75 పరుగులు (5 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసి ఇన్నింగ్స్‌కు పుంజు ఇచ్చాడు. చివర్లో షిమ్రాన్ హెట్మెయర్ మెరుపులతో స్కోరు 200 దాటింది.
211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ పోరాటం చివరి వరకు కొనసాగింది. ఓపెనర్ సాయి సుదర్శన్ 73 పరుగులతో జట్టును గెలుపు దిశగా నడిపించినా, కీలక సమయంలో వికెట్ కోల్పోయాడు. జోస్ బట్లర్, కుమార్ కుశాగ్ర పరవాలేదనిపించినా పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. మిడిల్ ఆర్డర్‌లో గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్ త్వరగా అవుట్ కావడం గుజరాత్‌కు దెబ్బతీసింది. చివర్లో రషీద్ ఖాన్ (24), కాగిసో రబడ (23 నాటౌట్) పోరాడినా విజయం దక్కలేదు.
రాజస్థాన్ బౌలింగ్‌లో రవి బిష్ణోయ్ కీలక పాత్ర పోషించాడు. తన స్పిన్ మాయాజాలంతో 4 వికెట్లు తీసి మ్యాచ్‌ను పూర్తిగా మలుపుతిప్పాడు. ముఖ్యంగా సాయి సుదర్శన్ వికెట్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. చివరి దశలో ఒత్తిడిని చక్కగా ఎదుర్కొన్న తుషార్ దేశ్‌పాండే రషీద్ ఖాన్ వికెట్ తీసి, ఆఖరి ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి జట్టుకు విజయాన్ని ఖాయం చేశాడు. ఈ మ్యాచ్‌లో జురెల్ మెరుపు ఇన్నింగ్స్, బిష్ణోయ్ చతుర బౌలింగ్, దేశ్‌పాండే కూల్ ఫినిషింగ్ రాజస్థాన్ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఈ గెలుపుతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.

