కలం, వెబ్ డెస్క్: అయోధ్య (Ayodhya) రాముడి ఆలయంలో విరాళాల చోరీ అంశం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న వేళ రేపు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అత్యవసర సమావేశం నిర్వహించబోతుంది. ట్రస్ట్ జనరల్ సెక్రటరీ, సభ్యుల రాజీనామా, సిట్ నివేదిక తదితర అంశాలపై చర్చించబోతుంది.
ట్రస్ట్‌కు కొత్త సీఈవోను ఏర్పాటు చేయాలని ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించింది. దీనిపై కూడా ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. అలాగే, ఇక నుంచి విరాళాల లెక్కింపు సహా ఆలయానికి సంబంధించిన ప్రతీ అంశంపై ఎలా వ్యవహరించాలో కూడా విధి విధానాలు ఖరారు చేయనుంది.
నా పరిధిలో ఉండదు: కోశాధికారి
విరాళాల లెక్కింపులో అవకతవకలు తన పరిధిలో ఉండవని ట్రస్ట్ కోశాధికారి వెల్లడించారు. ఆయన పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళ స్పందించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించిన స్టాండర్డ్ ఆఫ్ ప్రొసీజర్ ప్రకారమే లెక్కింపు జరుగుతుందని, దీనిలో ట్రస్ట్ అనవసర జోక్యం ఉండదన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే, ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్‌కు స్థానిక సాధువులు మద్దతు తెలిపారు. రాముడి ఆలయ నిర్మాణంలో రాయ్ పాత్ర అత్యంత కీలకమైందని.. ట్రస్ట్ నుంచి దూరం పెట్టే చర్యలు చేపట్టవద్దని కోరుతున్నారు. ఇప్పటికే సిట్ అధికారులకు వాంగ్మూలం ఇచ్చిన చంపత్ రాయ్.. డ్రైవర్ టిన్నూ యాదవ్‌ను పూర్తిగా నమ్మడమే తాను చేసిన తప్పిదమని ఆవేదన వ్యక్తం చేశారు.

