హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్‌ పార్టీ కలకలం.. ఆరుగురికి పాజిటివ్

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్‌ పార్టీ తీవ్ర కలకలం రేపింది. చారిత్రాత్మక గోల్కొండలోని తారామతి బారాదరి రిసార్టులో (Hyderabad Drug Party) గతరాత్రి ఈగల్‌ టీం మెరుపు దాడులు చేపట్టింది. రిసార్ట్ లో జరిగే ‘మోర్ దెన్ ఫ్రెండ్స్’ (More Than Friends) అనే ప్రైవేట్ ఈవెంట్‌ కు హాజరైన కొందరు డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లు ఈగల్‌ (EAGLE) టీంకు సమాచారం రావడంతో తనిఖీలు చేపట్టారు. డ్రగ్స్ వినియోగదారుల సస్పెక్ట్ షీట్‌లో ఉన్న వ్యక్తులు ఈ పార్టీకి హాజరైనట్లు ఈగల్ డీఎస్పీ భిక్షపతికి ముందస్తు సమాచారం అందడంతో రాత్రి 10 గంటల సమయంలో పోలీసులు రిసార్టును చుట్టుముట్టి.. ఎవరూ తప్పించుకోకుండా సెక్యూరిటీ ఏర్పాటు చేసి అనుమానితులకు టెస్టులు చేశారు. ఈ రిసార్టు ఈవెంట్‌లో సుమారు 200 మంది పాల్గొన్నారు. డ్రగ్స్ తీసుకున్నారనే అనుమానం వచ్చిన పోలీసులు.. 36 మందికి డ్రగ్స్‌ కిట్లతో పరీక్షలు జరిపారు. ఇందులో ఆరుగురికి పాజిటివ్ అని తేలింది.

పాజిటివ్ వచ్చిన వారిలో పరం సి నిహార్, ఆశి, యోగేశ్వర్, అబ్దుల్ సర్వర్, జాసన్ అనే వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. డ్రగ్స్‌ పాజిటివ్‌ వచ్చినవారిలో ఓ యువతి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్ నిర్వాహకుడు ‘చంద్ర’పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పర్యాటక ప్రచారంలో భాగంగా ఈ వేడుక నిర్వహిస్తున్నట్లు పేర్కొంటూ.. పోలీసుల అనుమతి కోసం నిర్వాహకులు చివరి నిమిషం వరకు ప్రయత్నించారు. అయినప్పటికీ అనుమతి రాకముందే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. నిందితులను వెంటనే అదుపులోకి తీసుకుని గోల్కొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పార్టీలో డ్రగ్స్ ఎక్కడి నుండి వచ్చాయి? ఇందులో నిర్వాహకుల పాత్ర ఎంత? అనే కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఆదివారం ఈ కేసుకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడిస్తామని తెలిపారు.

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>