కలం, వెబ్ డెస్క్ : మండుటెండల వేళ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలంగాణలో ఆరురోజుల పాటు వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నేటి నుంచి ఆరు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు (Rains) కురుస్తాయని పేర్కొంది. ఈ నెల 16 నుంచి 21వ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల్లో వర్షాలు పడతాయని వెల్లడించింది. సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, హైదరాబాద్, నల్లగొండ జిల్లాలో వర్షాలు ప్రారంభమవుతాయని వివరించింది. మంగళ, బుధ వారాల్లో ఉత్తర తెలంగాణలోని మరికొన్ని జిల్లాల్లో వానలు పడుతాయని పేర్కొంది. మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ద్రోణి కొనసాగనుందని చెప్పింది. ఈ కారణంగా నేటి నుంచి 21వ తేదీ వరకు తెలంగాణలో ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
మరోవైపు, ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్ లోను వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, అనకాపల్లి, అల్లూరి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, శ్రీ సత్యసాయి, నంద్యాల, అనంతరపురం, కర్నూలు, ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కృష్ణ, విశాఖ, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఉరుములు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

