కలం, వెబ్ డెస్క్: ప్రధాని మోదీపై నీట్ అభ్యర్థులకు ఏమాత్రం నమ్మకం లేదని.. ఆయన దేశ యువత విశ్వాసాన్ని కోల్పోయారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శించారు. ‘ఇటీవలే నీట్ పేపర్ లీకేజీ, రద్దు నేపథ్యంలో కొందరు అభ్యర్థులను తన ఇంటికి ఆహ్వానించి, వారితో మాట్లాడారు. అనంతరం ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. వాట్సాప్, టెలిగ్రామ్‌ల్లో ప్రశ్నాపత్రాలు అమ్మేస్తున్నారని విద్యార్థులు నాకు చెబుతున్నారు. వారికి స్పష్టంగా తెలుసు.. ఎవరు అమ్ముతున్నారు, ఎవరు కొంటున్నారు. మాఫియా ఎలా నడస్తుందో.. ఈ పిల్లలకు పూర్తిగా తెలుసు. ఇంత జరుగుతున్నా ఏమీ పట్టించుకోని ప్రభుత్వం, సంస్థలతో ఏం లాభం?. ఈ వ్యవస్థను ఎలా నడిపించాలో ప్రభుత్వం కంటే వారికే బాగా తెలుసు’ అన్నారు.
సైన్యాన్ని రంగంలోకి దించుతారా..?
రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘దేశ రక్షణ మాత్రమే సైన్యం బాధ్యత. కానీ, మోదీ ప్రభుత్వం పేపర్ల లీకేజీ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఏకంగా పరీక్ష నిర్వహణ కోసమ ఆర్మీనే రంగంలోకి దించబోతుంది. ఇంతకన్నా సిగ్గుచేటు ఉంటుందా. అతుకుల బొంతలా.. తూతూమంత్రంగా చర్యలు చేపడితే సరిపోదు. మొత్తం పరీక్షల వ్యవస్థనే సమూలంగా ప్రక్షాళన చేయాలి. విద్యార్థులు, టీచర్లు, నిపుణులతో కొత్త వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఇక మేం విద్యార్థులను కోల్పోవాలనుకోవడం లేదు. అలాగే, అవినీతిమయమైన వ్యవస్థ చేతిలో ఒక తరం విద్యార్థుల భవిష్యత్తును అసలే పెట్టాలనుకోవడం లేదు’ అని పేర్కొన్నారు.

