కలం, ఖమ్మం బ్యూరో : ప్రతి కేసులోనూ ‘క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ (సమగ్ర దర్యాప్తు) ద్వారా నేరస్తులకు శిక్ష పడేలా చేసి, బాధితులకు త్వరితగతిన న్యాయం చేకూర్చాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ (SP Rohith Raju) పోలీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో నిర్వహించిన జిల్లా నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, శాంతిభద్రతల పరిస్థితిపై అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, కేసుల విచారణలో ఎలాంటి జాప్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు.
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ.. పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాల ద్వారా నిరంతరం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని సూచించారు. జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా గంజాయి హాట్ స్పాట్స్‌ను గుర్తించి, రవాణా చేసే వారితో పాటు సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేయాలన్నారు.
అనుమానితులకు ‘గంజాయి రాపిడ్ కిట్ల’ ద్వారా తనిఖీలు నిర్వహించి, పాజిటివ్ వచ్చిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా నిరంతరం అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ కోరారు. సైబర్ నేరాల్లో డబ్బు నష్టపోయిన బాధితుల నుండి ఫిర్యాదు రాగానే తక్షణమే స్పందించి అండగా నిలవాలన్నారు. అలాగే, అత్యవసర సమయాల్లో ‘డయల్ 100’ నుండి పిలుపు రాగానే సిబ్బంది అత్యంత వేగంగా స్పందించి బాధితులకు క్షేత్రస్థాయిలో సాయం అందించాలని సూచించారు.
కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో నిరంతరం సమన్వయం పాటిస్తూ, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు గాను.. మద్యం సేవించి వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం వంటి ఉల్లంఘనలపై నిరంతరం వాహన తనిఖీలు చేపట్టి, బాధ్యులపై కఠినమైన కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ, పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్, మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి, ఇల్లందు డిఎస్పీ వెంకన్న బాబు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

