కలం, వెబ్ డెస్క్: జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీలో తిరుగుబాటు మొదలయింది. ఆప్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో ముగ్గురు రాజ్యసభ సభ్యులు చేరనున్నట్లు ప్రకటించారు. ఆప్ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చడ్డా (Raghav Chadha) బీజేపీ పార్టీలో చేరనున్నట్లు స్పష్టం చేశారు. ఆయనతో పాటు మరో ఇద్దరు సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ కమలం పార్టీలో చేరనున్నారు. ఆప్ ప్రస్తుతం అవినీతి పరుల చేతుల్లో ఉందని.. పార్టీని ఎంతో కష్టపడి పైకి తీసుకొచ్చామని రాఘవ్ చడ్డా తెలిపారు. ఇంతకాలం ఒక ‘రాంగ్ పార్టీ’లో ఉన్నామన్నారు. ఇప్పుడు బీజేపీలో చేరుతున్నది ముగ్గురే అయినా మరో నలుగురు కూడా త్వరలోనే చేరుతారని అన్నారు.
రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి (AAP) మొత్తం పది మంది ఎంపీలున్నారు. ఇందులో మూడింట రెండొంతుల మంది బయటకు వచ్చినందున రాజ్యసభలోని ఆప్ పక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి చడ్డాను ఆప్ తొలగించిన విషయం తెలిసిందే. ఆప్ విధానాలకు విరుద్దంగా పనిచేస్తున్నారంటూ ఆయనపై పార్టీ నాయకత్వం ఆరోపణలు చేసింది. ఆ తర్వాతనే ఆయనను డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బాధ్యతల నుంచి తొలగించింది. పార్టీ నాయకత్వంతో గత కొన్నాళ్ళుగా విభేదాలున్నట్లు రాఘవ్ చడ్డా (Raghav Chadha) పలుమార్లు వ్యాఖ్యానించారు.
Read Also: ఇష్టంలేని గర్భంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

