ఇష్టంలేని గర్భంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్: ఏ మహిళను లేదా మైనర్ అమ్మాయిని వారి ఇష్టం లేకుండా గర్భాన్ని (Forced Pregnancy) ఉంచుకోవాల్సిందేనని ఏ న్యాయస్థానం బలవంతం చేయద్దని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. ఒక మహిళ పునరుత్పాదక స్వాతంత్ర్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని నొక్కిచెప్పింది. గర్భం అనివార్యమే అయినా ఆ యువతికి ఇష్టం లేనప్పుడు కొనసాగించాలంటూ ఆదేశించడం రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించినట్లే అవుతుందని వ్యాఖ్యానించింది. ఏ న్యాయస్థానం కూడా ఒక మహిళను లేదా మైనర్ బాలికను వారి స్వేచ్ఛకు, ఇష్టానికి వ్యతిరేకంగా గర్భాన్ని పూర్తి కాలం మోయాల్సిందేనని బలవంతం చేయలేదని తేల్చి చెప్పింది. ఏడు నెలల గర్భం ఉన్న 15 ఏళ్ల అమ్మాయికి వైద్యపరంగా గర్భస్రావం చేసుకోవడానికి జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జ్వల్ భుయాన్‌లతో కూడిన బెంచ్ అనుమతి ఇచ్చింది.

గర్భందాల్చిన మహిళ తీసుకునే నిర్ణయమే ముఖ్యమని, ఇంకా పుట్టని బిడ్డ గురించి ఆలోచించలేమని వ్యాఖ్యానించింది. ఇష్టంలేని గర్భాన్ని కొనసాగిస్తే ఆ అమ్మాయి మానసిక ఆరోగ్యం, చదువు, సమాజంలో ఆమె స్థానంపై ప్రభావం చూపుతుందని బెంచ్ పేర్కొంది. ఒక వ్యక్తి శరీరం లేదా పునరుత్పాదక విషయాల్లో నిర్ణయాలు తీసుకునే హక్కు రాజ్యాంగం ఆర్టికల్ 21 కింద వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రైవసీలో భాగమని ప్రస్తావించింది. ఈ పరిస్థితుల్లో ఏ న్యాయస్థానం కూడా ఒక మహిళను, మరీ ముఖ్యంగా మైనర్ అమ్మాయిని గర్భాన్ని పూర్తి కాలం దాకా మోయాల్సిందేనని బలవంతం చేయకూడదని నొక్కిచెప్పింది. అలా బలవంతం చేయడం వల్ల మానసిక, శారీరక గాయానికి కారణమవుతుందని వ్యాఖ్యానించింది.

ప్రస్తుత కేసులో ఉద్దేశపూర్వకంగానే మైనర్ బాలిక వివరాలను కోర్టు గోప్యంగా ఉంచింది. “బిడ్డను పెంచడానికి ఆసక్తి లేకపోతే దత్తత ఇచ్చేయవచ్చు. అందువల్ల బిడ్డను కనాల్సిందే అని చెప్పడం సులభమే. కానీ అది అనివార్య గర్భం విషయంలో పరిగణించాల్సిన అంశం కాదు. అలాంటి సందర్భంలో ఆమె ఇష్టం లేకుండా బిడ్డను కనమని ఆదేశించడం ఆ గర్భిణీ సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేయడమే.. ఇంకా పుట్టని బిడ్డకు అధిక ప్రాధాన్యత ఇవ్వడమే అవుతుంది” అని బెంచ్ వ్యాఖ్యానించింది. “గర్భిణీ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పరిస్థితులను అవగాహన చేసుకోవాలి. ఇంకా పుట్టని బిడ్డ గురించి కాదు” అని కోర్టు వ్యాఖ్యానించింది.

గర్భస్రావం చేయించుకోవాలనుకునే వ్యక్తి మానసిక ఆలోచన నుంచి వాస్తవాలను, పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నది. గర్భాన్ని పూర్తి చేసి బిడ్డను కనాల్సిందేనని కోర్టు ఆదేశిస్తే అక్రమ గర్భస్రావ (Forced Pregnancy) కేంద్రాలకు వెళ్లి మరింత ప్రమాదాలకు లోనయ్యే పరిస్థితి తలెత్తుతుందని వ్యాఖ్యానించింది. గర్భందాల్చిన అమ్మాయి వయసు 15 ఏళ్లు మాత్రమేనని పేర్కొంది. గర్భం అనివార్యమైనందున దానిని కొనసాగించాలని చెప్పడం ఆమె ఆరోగ్య సంక్షేమానికి మంచిది కాదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఆ బాలిక రెండు సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసిన అంశాన్ని బెంచ్ గుర్తుచేసింది.

Read Also: కార్పొ’రేట్’ వైద్యం.. తెలంగాణలో ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>