కలం, నిజామాబాద్ బ్యూరో: కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ), నిజామాబాద్ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్ సందర్భంగా నిజామాబాద్ (Nizamabad) గిర్‌రాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన (Drug Awareness Program) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఈగల్ ఫోర్స్ డీఎస్పీ సోమనాథం (DSP Somanatham) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
విద్యార్థులు మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, మంచి స్నేహాలను ఎంచుకుని విద్య, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. డ్రగ్-ఫ్రీ తెలంగాణ లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు, కఠిన చర్యలను సమర్థవంతంగా కొనసాగిస్తోందని తెలిపారు. కేవలం సరదాగా మాదకద్రవ్యాలను ఒకసారి వినియోగించినా అది వ్యసనానికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాబోయే ఐదు నుంచి ఏడు సంవత్సరాలను విద్య, నైపుణ్యాభివృద్ధికి అంకితం చేసి, స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగాలని, సానుకూల స్నేహ వాతావరణాన్ని అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. మాదకద్రవ్యాల వ్యసనం ఆరోగ్యం, విద్య, ఉపాధి, కుటుంబ జీవితాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని పేర్కొన్నారు.
కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. రామ్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు మాదకద్రవ్యాల వ్యతిరేక ఉద్యమానికి రాయబారులుగా మారాలని పిలుపునిచ్చారు. తోటి వారి ఒత్తిడికి లొంగకుండా కుటుంబ సభ్యులు, సమాజంలో అవగాహన కల్పించాలని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా ప్రతీ ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని సూచించారు. డ్రగ్-ఫ్రీ తెలంగాణ సాధనలో ప్రతి విద్యార్థి భాగస్వామి కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకురాలు నహీదా బేగం, అధ్యాపకులు, మోహన్ దాస్, ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్, ఆకాశవాణి 400 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు.

