ఎల్‌పీజీకి గుడ్ బై .. వంటలకు మరో ప్రత్యామ్నాయం

కలం, వెబ్ డెస్క్: ఇరాన్ (Iran) యుద్ధంతో భారత్ వ్యాప్తంగా వంట గ్యాస్ కొరత ఏర్పడింది. డొమెస్టిక్ సిలెండర్లకు ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దేశమంతా గ్యాస్ కోసం నానాతంటాలు పడుతుంటే పంజాబ్‌లోని ఒక గ్రామం మాత్రం.. తమకు అసలు ఈ ధరలు, కొరతతో సంబంధం లేదని చెప్తోంది. ఎందుకంటే వారు గత పదేళ్లుగా వంట గ్యాస్ (LPG) వాడటమే మానేశారు. అవును, మీరు విన్నది నిజమే! పంజాబ్ రాష్ట్రం హోషియార్‌పూర్ జిల్లాలోని ‘లాంబ్రా కాంగ్రీ’ గ్రామం వ్యర్థాల నుంచే వంటకు కావాల్సిన గ్యాస్‌ను సృష్టిస్తూ అద్భుతాలు చేస్తోంది.

దక్షిణ కొరియా స్ఫూర్తితో..

ఈ విప్లవాత్మక మార్పు వెనుక జస్విందర్ సింగ్ సైనీ అనే వ్యక్తి కృషి ఉంది. ఆయన ఒకప్పుడు దక్షిణ కొరియా (South Korea) పర్యటనకు వెళ్ళినప్పుడు, అక్కడ వ్యర్థాలను ఇంధనంగా మార్చే విధానాన్ని చూసి ఇన్‌స్పైర్ అయ్యారు. తన గ్రామంలో పశువుల పేడ వల్ల కాలువలు నిండిపోవడం, అపరిశుభ్రత పెరగడం గమనించిన ఆయన, ఆ వ్యర్థాలనే ఇంధనంగా మార్చాలని సంకల్పించారు. పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, కేంద్ర ప్రభుత్వం నుంచి అందిన రూ. 2 లక్షల గ్రాంట్‌తో 2016లో కమ్యూనిటీ బయోగ్యాస్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు.

ఒక్క ప్లాంట్.. 44 కుటుంబాల కష్టాలకు చెక్

గ్రామంలోని ‘లాంబ్రా కాంగ్రీ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ’ ఆధ్వర్యంలో ఈ ప్లాంట్ నడుస్తోంది. దీని పనితీరు ఎలా సాగుతోందంటే. ప్రతిరోజూ గ్రామం నుంచి దాదాపు 2,500 కిలోల పశువుల పేడను సేకరించి ప్లాంట్‌కు తరలిస్తారు. ఈ పేడ నుంచి శాస్త్రీయ పద్ధతిలో మీథేన్ గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తారు. తయారైన గ్యాస్‌ను పైపుల ద్వారా నేరుగా 44 ఇళ్లకు కనెక్షన్ ఇచ్చారు. ప్రతి ఇంటికి డిజిటల్ మీటర్లను అమర్చారు. దీనివల్ల ఎవరు ఎంత గ్యాస్ వాడుతున్నారో కచ్చితంగా తెలుస్తుంది.

బడ్జెట్‌కు ఊరట.. అదనపు ఆదాయం!

సాధారణంగా ఒక ఎల్‌పీజీ (LPG) సిలిండర్ ధర రూ. 700 పైనే ఉంటుంది. కానీ, ఈ గ్రామంలోని కుటుంబాలు నెలకు కేవలం రూ. 200 నుంచి రూ. 300 మాత్రమే ఖర్చు చేస్తున్నాయి. అంటే సగానికి పైగా ఆదా అవుతోంది. కేవలం గ్యాస్ మాత్రమే కాదు, ఈ ప్లాంట్ ద్వారా మరో ప్రయోజనం కూడా ఉంది. గ్యాస్ తయారైన తర్వాత మిగిలే వ్యర్థ పదార్థాన్ని అత్యంత నాణ్యమైన సేంద్రీయ ఎరువుగా విక్రయిస్తున్నారు. దీనివల్ల గ్రామానికి అదనపు ఆదాయం సమకూరుతోంది. పశువుల పేడ వల్ల వచ్చే కాలుష్యం తగ్గడమే కాకుండా, ఊరంతా స్వచ్ఛంగా తయారైంది.

లాంబ్రా కాంగ్రీ గ్రామం సాధించిన ఈ విజయం కేవలం ఒక జిల్లాకో, రాష్ట్రానికో పరిమితం కాకూడదు. పశుసంపద మెండుగా ఉన్న భారతీయ గ్రామాల్లో ఇలాంటి బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తే.. ఇంధనం కోసం విదేశాలపై ఆధారపడటం తగ్గడమే కాకుండా, పర్యావరణానికి మేలు జరుగుతుంది. చెత్తను సంపదగా మార్చుకోవచ్చని నిరూపించిన ఈ గ్రామం, నిజంగానే నవ భారతానికి ఒక దిక్సూచి.

Read Also: CSK లోకి సంజూ.. పీయూష్ ఏమన్నాడంటే?

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>