కలం, వెబ్ డెస్క్ : భారత కోస్ట్ గార్డ్ (ICG) లో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడంతో పాటు సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కేంద్ర రక్షణ శాఖ కీలక అడుగులు వేసింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) రెండు ప్రతిష్టాత్మక విధాన సంస్కరణలను మంగళవారం న్యూఢిల్లీలో అధికారికంగా ప్రకటించారు. ఈ కొత్త విధానాల ద్వారా ఐసీజీలో మహిళా అధికారుల నియామకం, వారి సేవా నిబంధనల్లో సమానత్వానికి ప్రాధాన్యత లభించనుంది. దీనితో పాటు విధి నిర్వహణలో భాగంగా సముద్రంలో అదృశ్యమైన తీర రక్షక దళ సిబ్బంది కుటుంబాలకు ఇచ్చే ఎక్స్ గ్రేషియా పరిపాలనా ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ రెండో సంస్కరణను తీసుకొచ్చారు.
న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్-2 వేదికగా జరిగిన ఈ అధికారిక కార్యక్రమంలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ పరమేశ్ శివమణి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ ఈ చారిత్రాత్మక మార్పులు సాయుధ దళాల నైతిక స్థైర్యాన్ని, పనితీరును మరింత పటిష్టం చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు. 2027లో ఐసీజీ జరుపుకోబోయే స్వర్ణోత్సవాల దిశగా ఇవి మైలురాయిగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.

