కరీంనగర్ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు.. పదవులపై నేతల పోరు

కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ కాంగ్రెస్‌ (Karimnagar Congress) లో అంతర్గత విబేధాలు రచ్చకెక్కుతున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్‌లో పార్టీని బలోపేతం చేయాల్సిన నేతల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కనపెట్టి, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పీఠాలు వేస్తున్నారంటూ సీనియర్లు, కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా, పార్టీని బలోపేతం చేయడంలో నేతల మధ్య ఆధిపత్య పోరులో వెనుకబడిపోయారని శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. జిల్లా మంత్రులు, సీనియర్ నేతలు జిల్లా పార్టీలో పరిస్థితిని చక్కదిద్దకపోవడంపై కేడర్ ఆందోళన చెందుతోంది.

డివిజన్ కమిటీలపై రెండు నివేదికలు

కరీంనగర్ కార్పొరేషన్ అర్బన్ అధ్యక్షుడిగా వైద్యుల అంజన్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు. అసెంబ్లీ ఇన్ చార్జ్ కాటంశెట్టి రాజేందర్ రావు గట్టి పోటీ ఇచ్చినా, చివరికి మంత్రి పొన్నం ప్రభాకర్ మద్దతుతో అంజన్ కుమార్‌నే పదవి వరించింది. నిర్దిష్ట గడువు దాటినా నేటికీ డివిజన్ కమిటీల నియామకం పూర్తికాలేదు. అయితే.. ప్రతీ డివిజన్‌కు 10 మంది చొప్పున కార్యవర్గాన్ని ఎంపిక చేసి పీసీసీకి నివేదిక అందించారు. సీనియర్లను పక్కనబెట్టి తమ అనుచరులకే ప్రాధాన్యమిచ్చారని విమర్శలు రావడంతో నియామకాలు నిలిచిపోయాయి. రాజేందర్ రావు కూడా పీసీసీకి మరో ప్రత్యేక జాబితాను అందిచండంతో సమస్య మరింత సంక్లిష్టంగా మారింది. పీసీసీ నాయకత్వం కూడా తేల్చకుండా కమిటీలను పెండింగ్‌లో పెట్టడంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జాడ లేని నామినేటెడ్ పదవులు

మరోవైపు పార్టీ కోసం కష్టపడిన సీనియర్లకు కాకుండా, వేరే పార్టీల నుంచి వచ్చిన వారికే నామినేటెడ్ పదవులు కట్టబెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డెయిరీ, లైబ్రరీ కమిటీలకు నియామకాలు చేపట్టకపోవడంపై కేడర్‌లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా స్థాయి నుంచి కార్పొరేషన్ స్థాయి వరకు పలు నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తారని ఆశించిన సీనియర్లకు తీవ్ర నిరాశే మిగిలింది. గ్రంథాలయ, దేవాలయ, లైబ్రరీ, టెంపుల్ కమిటీల నియామకంపై అధిష్ఠానం దృష్టి సారించకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోసిన సీనియర్లను పక్కనబెట్టి, కొత్తగా వచ్చిన వారికి పీఠాలు కట్టబెడుతున్నారనే విమర్శలున్నాయి.

ఇందిరమ్మ కమిటీలనూ వదలని వివాదాలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో భాగమైన “ఇందిరమ్మ కమిటీల” ఎంపిక ప్రాసెస్ తీవ్ర వివాదాస్పదంగా మారింది. గతంలోనూ, ఇప్పుడు కూడా అసెంబ్లీ ఇన్ చార్జ్, డీసీసీ చీఫ్ మధ్య వేర్వేరు జాబితాల వివాదం నడుస్తోంది. మంత్రులు సైతం తమ అనుచరుల జాబితాలనే తోస్తుండటంతో పార్టీకి సుదీర్ఘకాలంగా సేవ చేసిన కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. గతంలో అసెంబ్లీ ఇన్ చార్జ్ పొన్నం శ్రీనివాస్, సిటీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి హయాంలో రూపొందించిన జాబితాను జిల్లా ఇన్ చార్జ్ మంత్రి ఉత్తమ్‌కు అందించారు. కానీ అవి పెండింగ్‌లోనే ఉండిపోయాయి. ప్రస్తుతం మళ్లీ సిటీ అధ్యక్షుడు అంజన్ కుమార్, ఇన్ చార్జ్ మంత్రి ఉత్తమ్‌తో పాటు మరో మంత్రి పొన్నం ప్రభాకర్ వద్దకూ విడివిడిగా జాబితాలు చేరాయి. ఈ ముగ్గురు నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో ఇందిరమ్మ కమిటీల నియామకం ముందుకు పడడంలేదు.

కాంగ్రెస్ ఉనికికే ప్రమాదమా?

పదవుల కోసం నేతల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ ఉనికికే ప్రమాదకరంగా మారిందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధిష్ఠానం జోక్యం చేసుకుని పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తుండగా పార్టీలో వివాదాలను పరిష్కరించి సమన్వయంతో ముందుకు తీసుకెళ్లకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, నేతల మధ్య అధిపత్య పోరును పీసీసీ నాయకత్వం వెంటనే పరిష్కరించి, కష్టపడ్డ కార్యకర్తలకు తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>