Delhi Blast | ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం చోటుచేసుకున్న పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ ఘటన వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి డాక్టర్ ఉమర్ మహ్మద్ అని దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. ఉమర్ తన ఇద్దరు సహచరులతో కలిసి ఈ పేలుడుకు ప్రణాళిక రచించినట్టు అధికారులు తెలిపారు. పేలుడు కోసం ఉమర్ అమ్మోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్ మిశ్రమాన్ని, డిటోనేటర్లను వినియోగించినట్లు కూడా అధికార వర్గాలు ధృవీకరించాయి.
ఉమర్(Umar Mohammad) ఉపయోగించిన ఐ20 కారు కదలికలపై అధికారులు నిఘా ఉంచి కీలక వివరాలు సేకరించారు. బర్దార్‌పూర్ బోర్డర్ నుంచి ఈ కారు ఢిల్లీలోకి ప్రవేశించినట్టు సమాచారం. ఔటర్ రింగ్ రోడ్ మీదుగా ఓల్డ్ ఢిల్లీ ప్రాంతంలోకి వచ్చింది. సునెహరి మసీదు పార్కింగ్ ఏరియాలో కారు సుమారు మూడు గంటల పాటు నిలిపినట్టు సమాచారం. సీసీటీవీ ఫుటేజ్‌ల ద్వారా ఈ విషయం బయటపడింది. ఆ సమయంలో ఉమర్ కారులోనే ఉన్నట్లు దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. అనంతరం ఆ కారు ఎర్రకోట వైపు కదిలిన కొద్ది సేపటికే శక్తివంతమైన పేలుడు సంభవించింది. సునెహరి మసీదు, ఎర్రకోట మధ్య కేవలం 800 మీటర్ల దూరం మాత్రమే ఉండటంతో, ఆ ప్రాంతంలో ఒకసారిగా కలకలం రేగింది.
సీసీటీవీ దృశ్యాలు, వాహనం కదలికల ఆధారంగా ఉమర్ చుట్టూ ముసుగులో ఉన్న ఉగ్ర మాడ్యూల్ జాడలు బయటపడుతున్నాయి. ఉమర్‌కు ఫరీదాబాద్ మాడ్యూల్‌తో సంబంధాలు ఉన్నాయని అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఉమర్ ఉపయోగించిన మొబైల్ నంబర్లు, ఇంటర్నెట్ కమ్యూనికేషన్ వివరాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. జమ్మూ కాశ్మీర్‌లోని ఉమర్ తల్లి, సోదరులు ఆషిక్ అహమ్మద్, జహూర్ అహమ్మద్‌లను స్థానిక పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. ఈ వార్తలతో ఉమర్ కుటుంబం తీవ్ర షాక్‌కు గురైంది. “మా కొడుకు డాక్టర్ అయి కుటుంబానికి ఆధారంగా ఉంటాడని ఆశించాం. అతడిలా వ్యవహరించాడని నమ్మలేకపోతున్నాం,” అని ఉమర్ తల్లి కన్నీరు మున్నీరయ్యారు. కుటుంబ సభ్యులు అతడు చిన్నప్పటి నుంచే తెలివైన విద్యార్థి అని, వైద్య విద్య పూర్తయ్యాక సొంతగా క్లినిక్ ప్రారంభించాలని కలలు కనేవాడని తెలిపారు.
Delhi Blast | ఉమర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఢిల్లీ పోలీసులతో పాటు ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో సంయుక్తంగా ఈ దర్యాప్తును ముందుకు తీసుకెళ్తున్నాయి. పేలుడుతో సంబంధించిన ప్రతి సాంకేతిక ఆధారాన్ని పరిశీలిస్తున్న అధికారులు, ఈ దాడి వెనుక ఉన్న అంతర్జాతీయ సంబంధాలను కూడా విశ్లేషిస్తున్నారు.
Read Also: హైదరాబాద్‌లో ఉగ్రవాది అరెస్ట్.. భారీ కుట్ర భగ్నం
Follow Us on: Instagram

