High Court | ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని ఆరోపిస్తూ ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేందుకు ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ఈనెల 8న భారీ సభ నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఎల్బీ స్టేడియాన్ని వేదికగా ఎంచుకున్నది. అనుమతి కోసం పోలీసులకు దరఖాస్తు చేసింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సభలు, ప్రదర్శనలకు అనుమతి ఇవ్వలేమని పోలీసులు స్పష్టం చేశారు.
దీంతో ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య న్యాయపరమైన మార్గాన్ని ఎంచుకుంది. సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ హైకోర్టు(High Court)లో అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై భోజన విరామం అనంతరం విచారణ జరగనుంది. సమాఖ్య నాయకులు ప్రభుత్వానికి బకాయి ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని తక్షణం విడుదల చేయాలని, లేకపోతే విద్యాసంస్థల నిర్వహణ కష్టసాధ్యమవుతుందని పలుమార్లు హెచ్చరించారు. ఇప్పటికే వేలాది మంది బోధనా, అబోధనా సిబ్బంది వేతనాలు నెలల తరబడి ఆలస్యమవుతున్నాయని వారు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎల్బీ స్టేడియం సభ ద్వారా తమ డిమాండ్లను బలంగా వినిపించాలని నిర్ణయించిన సమాఖ్యకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఉద్రిక్తత నెలకొంది.
నేతలు దీనిని ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనగా అభివర్ణిస్తూ, “మా కార్యక్రమం రాజకీయపరమైనది కాదు, విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం మాత్రమే” అని స్పష్టం చేశారు. మరోవైపు, ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతుందని భావించిన పోలీసులు మాత్రం తమ నిర్ణయంపై వెనక్కి తగ్గే అవకాశాలు లేవని తెలిపారు. మరి కోర్టు అనుమతి ఇస్తుందా? లేదా? అన్నది వేచి చూడాలి.
Read Also: బీహార్‌లో ప్రశాంత్ కిశోర్ సర్వే ఏం చెబుతోంది?
Follow Us on: Youtube

