Prashant Kishor Survey | బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి గురువారం తొలివిడత పోలింగ్ పూర్తయిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి రికార్డు పోలింగ్ నమోదైంది. దీంతో ఏ కూటమికి లాభం? అన్న చర్చ జరుగుతోంది. సహజంగా పోలింగ్ శాతం పెరిగితే ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నట్టు భావించాలని విశ్లేషకులు అంచనా వేస్తుంటారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని మార్చాలి అని ఓటర్లు గట్టిగా నిర్ణయించుకున్నప్పుడే పోలింగ్ శాతం పెరుగుతుందన్న చెబుతుంటారు. అదే జరిగితే మహాఘట్ బంధన్ కూటమికి లాభం జరిగే అవకాశం ఉంటుంది.
గురువారం జరిగిన ఓటింగ్‌లో రికార్డు స్థాయిలో 64.66 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇది 1951 తర్వాత రాష్ట్ర చరిత్రలోనే అత్యధికం కావడం విశేషం. ఈ నేపథ్యంలో జన్ సురాజ్(Jan Suraaj) పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) స్పందించారు. “బీహార్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. నేను నెలల తరబడి చెబుతున్నదే ఇప్పుడు నిజమైంది” అని అన్నారు.
రాష్ట్రంలో ప్రజలు కొత్త మార్పు దిశగా ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. “జన్ సురాజ్ పార్టీ ఇప్పుడు ప్రజలలో ఒక నిజమైన ఎంపికగా నిలిచింది. ప్రజల మద్దతు చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. నవంబర్ 14న మా పార్టీ చరిత్ర సృష్టించబోతుంది” అని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. అలాగే పోలింగ్ శాతం పెరగడానికి ఛత్ పండుగ కూడా ఒక కారణమని అన్నారు.
ఇక ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం, బీహార్ తొలి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఊహించని రీతిలో ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ బూత్‌లకు తరలివచ్చారు. ఒక పండుగ వాతావరణంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 121 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ విడతలో ఎన్నికలు జరిగాయి. రెండో విడతగా వచ్చే మంగళవారం 122 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలు ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఇండి కూటమి తరఫున తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో ఉంటే, అధికార ఎన్డీఏ కూటమి మాత్రం సీఎం అభ్యర్థిని ప్రకటించకుండా ప్రచారం సాగిస్తోంది. ప్రతిపక్షం “ఇంటికో ప్రభుత్వం” అంటూ నినాదం ఇవ్వగా, అధికార కూటమి “కోటి ఉద్యోగాలు” వాగ్దానం చేస్తూ ప్రజల మద్దతు కోరుతోంది.
పెరిగిన మహిళా ఓటింగ్
పోలింగ్ సమయంలో మహిళల ఓటింగ్ శాతం కూడా ఈసారి రికార్డు స్థాయిలో నమోదైనట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వినోద్ గుంజ్వాల్ తెలిపారు. “ఓటింగ్ సమయంలో ఏర్పడ్డ అన్ని సమస్యలను వెంటనే పరిష్కరించాం. ప్రజల స్పందన అపూర్వం” అని ఆయన పేర్కొన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. 1951-52లో కేవలం 42.6 శాతం, 2000లో 62.57 శాతం, 2020లో 57.29 శాతం మాత్రమే నమోదైందని ఎన్నికల సంఘం గుర్తు చేసింది. 2025 ఎన్నికల్లో తొలి విడతలోనే 64.66 శాతం నమోదు కావడం బీహార్ రాజకీయాల్లో కొత్త రికార్డ్‌గా నిలిచింది. అయితే మహిళా ఓటర్లు పెరగడం తమకు అనుకూలమని ఎన్డీయే కూటమి చెబుతోంది. మరి ఏం జరుగుతుందో.. ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.
Read Also: పాకిస్థాన్ మీడియాపై రష్యా తీవ్ర ఆగ్రహం..
Follow Us on: Instagram

