కలం, ఖమ్మం బ్యూరో: కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా ఏప్రిల్ మాసంలో మూడు నెలల రేషన్ (Fine Rice) ఒకేసారి ఇవ్వడానికి ఖమ్మం (Khammam) జిల్లా యంత్రాంగం రెడీ అవుతోంది. ఇందులో భాగంగా రేషన్ సరఫరాకు సంబంధించిన 12 గోదాములకు 12 మంది జీపీఓలను ఇన్‌చార్జిలుగా నియమించారు. ఖమ్మం జిల్లాకు 25 వేల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం పడుతుంది. ఏప్రిల్ ఒకటి నుంచి ప్రతి రోజూ ఉదయం 9 గంటలకు ప్రారంభించేలా రేషన్ డీలర్లకు ఆదేశాలు ఇప్పటికే జారీ చేశారు. అందుకనుగుణంగా ఏం.ఎల్.ఎస్ పాయింట్లకు సకాలంలో రేషన్ అందేలాగా అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా జిల్లా యంత్రాంగం గట్టి చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే బుధవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సంబంధిత అధికారులతో బియ్యం స్టాక్ పంపిణీపై సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.

