30 నెలలైనా PRC రిపోర్టు ఎక్కడ? ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాల జేఏసీ ఫైర్

కలం, తెలంగాణ బ్యూరో : దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ రిపోర్టు (PRC Report) పై ఉద్యోగులు భగ్గుమంటున్నారు. ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో పడ్డారు. నివేదిక సమర్పించడానికి ఇచ్చిన గడువు ఆరు నెలలే అయినా 30 నెలలుగా ఎలాంటి పురోగతి లేదని ఆగ్రహంతో ఉన్నారు. అన్ని ఉద్యోగ సంఘాలతో కూడిన జేఏసీ ప్రతినిధులు ప్రధాన కార్యదర్శిని కలిసి రాతపూర్వకంగా కోరారు. ఇంకేమాత్రం పీఆర్సీ గడువును పొడిగించకుండా వెంటనే నివేదిక తెప్పించుకోవాలని రిక్వెస్టు చేశారు. పీఆర్సీ అమలుకాని కారణంగా ఉద్యోగులు కనీస స్థాయిలో ప్రతి నెలా రూ. 20 వేల చొప్పున నష్టపోతున్నారని వివరించారు. పిల్లల స్కూలు, ట్యూషన్ ఫీజుల మొదలు ఇండ్ల ఈఎంఐ (EMI)లు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల వైద్య ఖర్చులు.. ఇలాంటివన్నీ ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నాయని తెలిపారు.

పీఆర్సీ గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు :

ఆరు నెలల వ్యవధిలో పీఆర్సీ రిపోర్టును (PRC Report) సమర్పించాలన్న నిబంధనతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 అక్టోబరు 2న పీఆర్సీని నియమించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివశంకర్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ఇప్పటికీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వలేదు. ఆరు నెలల నిబంధన ఇప్పుడు 30 నెలలకు చేరుకున్నది. ఒకవైపు ద్రవ్యోల్బణంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని, మరోవైపు ప్రభుత్వం నుంచి రావాల్సిన డీఏ (DA) బకాయిలు కూడా ప్రభుత్వం దగ్గరే పేరుకుపోయాయని ఉద్యోగ సంఘాలు గుర్తుచేశాయి. గత ప్రభుత్వంలో ఏర్పడిన పీఆర్సీకి గడువును పొడిగిస్తూ ప్రస్తుత ప్రభుత్వం ఉత్తర్వులను ఇస్తూ ఉన్నది. తాజాగా ఏప్రిల్ 2వ తేదీ నాటికి పీఆర్సీ గడువు ముగిసింది. రిపోర్టు ప్రభుత్వానికి చేరకపోడంతో మరోసారి పొడిగించడానికి రంగం సిద్ధమైంది.

నివేదిక వద్దనుకుంటున్న సర్కార్ :

అనేక ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో పీఆర్సీ చైర్మన్ శివశంకర్ సంప్రదింపులు పూర్తి చేశారు. ఆ సంఘాల నుంచి రాతపూర్వకంగా మెమొరాండంలను స్వీకరించారు. వారి అభిప్రాయాలను రికార్డు చేశారు. రిపోర్టు సిద్ధం చేయడానికి ముందు జరగాల్సిన ప్రక్రియ పూర్తయ్యి ఏడాది దాటిపోయిందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వాపోయారు. కానీ ఇప్పటివరకు నివేదిక ఇవ్వకపోవడంతో అసంతృప్తికి లోనైన ఉద్యగులు కొందరు పీఆర్ఎస్ సిబ్బంది నుంచి ఆరా తీశారు. నివేదిక సిద్ధంగానే ఉన్నదని, ప్రభుత్వం ఎప్పుడు సమయం ఇస్తే అప్పుడు అందజేయడానికి చైర్మన్ రెడీగా ఉన్నారని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. నివేదిక అందుకుంటే వెంటనే దాన్ని అమలు చేయాల్సి వస్తుందన్న ఉద్దేశంతోనే తాత్సారం చేస్తున్నదన్నది ఉద్యోగుల అభిప్రాయం. ఖజానాలో డబ్బులు లేనందువల్లనే ప్రభుత్వం ఇప్పట్లో రిపోర్టును తీసుకోడానికి సిద్ధంగా లేదన్న వాదనను వెలిబుచ్చారు.

Read Also: కాళేశ్వరంపై రాజ్యసభలో రగడ.. కిషన్ రెడ్డి VS సురేశ్ రెడ్డి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>