కలం, వెబ్ డెస్క్ : కుటుంబ పాలన, అవినీతి, అసమర్థ పాలన విషయంలో పినరయి విజయన్, కేసీఆర్‌ల మధ్య అనేక పోలికలు ఉన్నాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) విమర్శించారు. కేరళం అసెంబ్లీ ఎన్నికల సంబంధించి యూడీఎఫ్ మేనిఫెస్టోను కొచ్చిలో గురువారం రేవంత్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేరళంలో గత పదేళ్లుగా పినరాయి విజయన్ ప్రభుత్వం కొనసాగుతోందని, అలాగే 2014 నుంచి సుమారు పదేళ్ల పాటు కేసీఆర్ తెలంగాణను పాలించారన్నారు. 2023లో తెలంగాణలో లాగే ఈసారి కేరళంలో మార్పు చోటుచేసుకుంటుందని జోష్యం చెప్పారు. పినరయి విజయ్ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దింపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. “పో మోనే విజయా” వ్యాఖ్యపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు స్పందించిన రేవంత్ రెడ్డి… విజయన్ తమకు రాజకీయ ప్రత్యర్థి అని, మోడీలా మాట్లాడటం తనకు సాధ్యం కాదని, విమర్శించకుండా ఉండటం తన స్వభావం కాదని సీఎం స్పష్టం చేశారు.
యూడీఎఫ్ ప్రకటించిన గ్యారంటీలపై విమర్శలు చేస్తున్న వారు అవి ఎలా అమలవుతాయో తెలుసుకోవాలంటే తెలంగాణకు రావాలని రేవంత్ రెడ్డి సూచించారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో అమలవుతున్న పథకాలను ప్రత్యక్షంగా చూసి.. తమ ట్రాక్ రికార్డు పరిశీలించుకోవచ్చన్నారు. కేరళం సీఎం, మంత్రులు తెలంగాణలో గ్యారంటీలు ఎలా అమలు చేస్తున్నామో ప్రత్యక్షంగా చూపిస్తామన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేరళంలో పినరాయి విజయన్ హయాం ముగిసిందని, ఇక యూడీఎఫ్ స్వర్ణయుగం మొదలవుతుందన్నారు.
మోడీ బ్రదర్స్.. పినరయి, కేసీఆర్‌ల మధ్య పోలిక..
పినరయి విజయన్, ప్రధాని మోదీపై రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర విమర్శలు గుప్పించారు. దేవుడి సొంత రాష్ట్రంలో దేవుడి ఆస్తికి రక్షణ లేదంటూ పరోక్షంగా శబరిమల బంగారం ఉదంతాన్ని సీఎం లేవనెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు మోడీ కరుణ కాదని.. అది ప్రజల హక్కు అనే విషయం ప్రజలకు తెలియజేస్తామన్నారు. యూడీఎఫ్ కార్మికుల కూటమి అని, కూటమిలో నిజాయితీగల నాయకులు ఉన్నారని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.
తొలి క్యాబినెట్ నుంచే హామీల అమలు…
కేరళంలో యూడీఎఫ్ గ్యారంటీలు అమలు సాధ్యమా అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారని.. దానికి సమాధానం తెలంగాణ రాష్ట్రమే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి క్యాబినెట్ సమావేశం నుంచే గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. 25 లక్షల రైతు కుటుంబాలకు చెందిన రూ.21 వేల కోట్ల రుణాలను తాము మాఫీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రైతు భరోసా, ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్లు.. నియమకాలు, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్ల పథకం లాంటి ఆరుగ్యారంటీలను అమలు తీరును వివరించారు. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ -2047 ప్రకారం తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలపనున్నామని సీఎం ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ వృద్ధిరేటు 10.8 శాతంగా ఉందని, పన్నులు పెంచకుండానే అభివృద్ధి సాధ్యమని తాము నిరూపించామన్నారు. కార్యక్రమంలో కేపీసీసీ ప్రెసిడెంట్ సన్నీ జోసెఫ్, కేరళ సీఎల్పీ నేత వి.డి.సతీషన్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీప్ దాస్ మున్షీ, యూడీఎఫ్ కన్వీనర్ ఆదూర్ ప్రకాష్, ఐయూఎంఎల్ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.కె.కున్హాలికుట్టి తదితరులు పాల్గొన్నారు.
కేరళంలో ఇందిరా ఐదు గ్యారంటీలు…
1. కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (కేఎస్‌ఆర్టీసీ) బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
2. కాలేజీ చదువుతున్న బాలికలకు నెలకు రూ.1,000 ఆర్థిక సహాయం
3. సంక్షేమ పింఛన్లు నెలకు రూ.3 వేలకు పెంపు
4. మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాండీ పేరుతో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా
5. యువతకు స్వయం ఉపాధి కోసం రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు
ఐదు గ్యారంటీలతో పాటు సముద్ర, విమానయాన రంగాలకు సంబంధించి ఐదు డ్రీమ్ ప్రాజెక్టులు, వయనాడ్‌లో గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటు వాగ్దానాలు ఉన్నాయి.
Read Also: 30 నెలలైనా PRC రిపోర్టు ఎక్కడ? ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాల జేఏసీ ఫైర్
Follow Us On: Instagram

