కలం, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌ను దెబ్బకొట్టేందుకు గుజరాత్ టైటాన్స్ బౌలర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్ ఓపెనర్ ప్రబ్‌సిమ్రన్ సింగ్(Prabhsimran)ను అవుట్ చేసి గుజరాత్ మ్యాచ్‌లోకి తిరిగి వచ్చే ప్రయత్నం చేసింది. క్రీజులో ప్రమాదకరంగా మారుతూ సిక్సర్లతో విరుచుకుపడుతున్న ప్రబ్‌సిమ్రన్ సింగ్ (37 పరుగులు)ను స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ బోల్తా కొట్టించాడు. రషీద్ వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రబ్‌సిమ్రన్ క్రీజు వెలుపలికి వచ్చి స్ట్రెయిట్ షాట్ ఆడాడు. అయితే, బంతికి సరైన ఎలివేషన్ లభించకపోవడంతో లాంగ్-ఆన్ బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ప్రసిద్ధ్ కృష్ణ చేతుల్లోకి నేరుగా వెళ్లింది. దీంతో పంజాబ్ తన రెండో వికెట్‌ను కోల్పోయింది.
ప్రబ్‌సిమ్రన్ సింగ్ 24 బంతుల్లోనే 37 పరుగులు చేశాడు. ఇందులో ఒక ఫోర్, 4 భారీ సిక్సర్లు ఉన్నాయి. 9.4 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ 85/2 వద్ద ఉంది. గుజరాత్ బౌలర్లలో కగిసో రబడా ఒక వికెట్ తీయగా, రషీద్ ఖాన్ కీలకమైన ప్రబ్‌సిమ్రన్ వికెట్ పడగొట్టాడు. ప్రస్తుతం పంజాబ్ రన్ రేట్ (8.79) ఆశాజనకంగానే ఉంది. శ్రేయస్ అయ్యర్, కానోలీ ఇదే జోరును కొనసాగిస్తే పంజాబ్ విజయం ఖాయం. గుజరాత్ బౌలర్లు మరిన్ని వికెట్లు తీస్తేనే మ్యాచ్ ఉత్కంఠగా మారుతుంది.

