పిల్లల అల్లరిపై అరుస్తున్నారా? భవిష్యత్తులో వచ్చే సమస్యలు ఇవే!

కలం, వెబ్‌డెస్క్: సాధారణంగా పిల్లలు అన్నాక అల్లరి చేస్తారు. తల్లిదండ్రులు (Parents) తిడతారు, మాట వినకుంటే కొడతారు కూడా. కానీ పిల్లలపై కోప్పడటం వల్ల వారి మానసిక స్థితి దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లల ఇష్టాలకు తగినట్లుగా పేరెంట్స్ నడుచుకోవాలని సూచిస్తున్నారు. తల్లిదండ్రులు కోసం నిపుణులు సూచించిన కొన్ని పేరెంటింగ్ చిట్కాలు (Parenting Tips).

పిల్లలతో స్నేహంగా ఉండాలి

తల్లిదండ్రులు పిల్లలతో ఎంత స్నేహంగా ఉంటే వాళ్లు మనతో అంత సన్నిహితంగా ఉంటారు. ప్రతీ విషయాన్ని మనతో ధైర్యంగానూ పంచుకుంటారు. అలాకాకుండా పిల్లలు చేసే ప్రతీ పనిని అజమాయిషీ చేస్తున్నట్లుంటే వాళ్ల మానసిక స్థితి దెబ్బతింటుంది అంటున్నారు నిపుణులు. దీన్నే ‘కో-డిపెండెన్సీ పేరెంటింగ్’ అని కూడా అంటున్నారు. ఈ పేరెంటింగ్‌లో చిన్నారులపై ప్రతికూల ప్రభావం పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే తల్లిదండ్రులను కొన్ని ప్రత్యేక పద్ధతులు పాటించాలని హెచ్చరిస్తున్నారు.

పిల్లల ఇష్టాలకు ప్రాధాన్యత ఇవ్వడం

తల్లిదండ్రులు చిన్నారుల ఇష్టాలకు ప్రాధాన్యం ఇవ్వడం. ఉదాహరణకు ఆ రోజుకి వాళ్లు ఏం తినాలి? ఏం చదవాలి? ఏ బట్టలు వేసుకోవాలి? ఇవన్నీ వాళ్ల ఇష్టప్రకారమే చేయనివ్వాలట. అలా కాకుండా పేరెంట్స్ తమకు నచ్చినట్లు వారిని అజమాయిషీ చేయడం, నీకు ఏం తెలీదు చెప్పింది చెయ్ అనడం, ఈ రోజు కాదు రేపు వేసుకో, సాయంత్రం తిను వంటివి చెబుతూ వాళ్లని ఆపొద్దంటున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల వాళ్ల ఇష్టాలు, ఆలోచనలు, లక్ష్యాలు మీతో చెప్పగానే వద్దు అనేస్తారనే భావన వాళ్లకు కలుగుతుంది. ఫలితం వారు తరువాతి నుంచి వాళ్ల భావాలను మీతో పంచుకునేందుకు ఇష్టపడరు. అందుకే నేరుగా చెప్పకుండా చేసే పని వల్ల జరిగే లాభనష్టాలను వారికి వివరించాలి. అప్పుడు ఏది మంచో ఏది చెడో వారికి తెలుస్తుంది. దానికి అనుగుణంగా వాళ్లూ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ వారికి ఉంటుంది.

మన భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడం

అంతే కాకుండా కాస్త అల్లరి చేయగానే మనం గట్టిగా అరుస్తూ ఉంటాం. ఆపుతారా అల్లరి.. భరించేలేకపోతున్నా అంటూ తిట్టేస్తాం. చిన్నారి మనసు ఎంత గాయపడుతుందో కూడా మనం ఆలోచించం. ఇలా చేయడం వల్ల ఒకరకంగా వాళ్ల స్వేచ్చను, భావోద్వేగాలను మనమే అడ్డుకుంటున్న వారిమవుతామని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలన్నాక ఆమాత్రం అల్లరి చేయడం సహజమే. ఒక్కోసారి చిన్న చిన్న విషయాలపై కూడా అవసరం ఉన్నా లేకున్నా ఎక్కువ దృష్టి పెట్టడం మంచిది కాదంటున్నారు.

జాగ్రత్త.. పిల్లలకు తల్లిదండ్రులే రోల్ మోడల్స్

అంతేకాకుండా పిల్లలు పెద్దలను అనుసరించడం సహజమే కదా! కానీ ఇవేవి ఆలోచించకుండా కొన్ని సార్లు పేరెంట్స్ పిల్లల ముందే గొడవ పడుతుంటారు. అవి తెలియకుండానే వాళ్లపై ఒత్తిడి పెంచుతాయి. అందుకే పెద్దల గొడవలు పిల్లల వరకూ రానివ్వకూడదని సూచిస్తున్నారు నిపుణులు. ఏ పిల్లలకి అయినా తల్లిదండ్రులే రోల్ మోడల్స్ కదా! పెద్దలు ఏం చేస్తే చిన్నారులూ అదే చేస్తారు. అందుకే భార్యాభర్తలు ఒకరిపై ఒకరు పెత్తనం చెలాయించకుండా సానుకూలంగా ఉండాలని చెబుతున్నారు. ఇది భవిష్యత్తులో వాళ్ల ప్రవర్తనను ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>