బండి సంజ‌య్ సానుభూతి కోసం ప్ర‌య‌త్నించొద్దు: మంత్రి పొన్నం

క‌లం, వెబ్‌డెస్క్‌: కేంద్ర మంత్రి బండి సంజ‌య్ (Bandi Sanjay) కొడుకు బండి భ‌గీర‌థ్ వ్య‌వ‌హారం రాష్ట్ర రాజ‌కీయాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీనిపై బండి సంజ‌య్ స్పందించిన తీరుపై మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. త‌న‌ను రాజ‌కీయంగా ఎదుర్కోలేక కుట్ర‌లు చేస్తున్నార‌ని బండి సంజ‌య్ ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ మాట్లాడుతూ.. బండి కొడుకుపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం ఎలాంటి కుట్ర‌లు, క‌క్ష‌సాధింపు, వివ‌క్ష చేయ‌డం లేద‌న్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజ‌య్ త‌న కుమారుడిపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై నిష్ప‌క్ష‌పాతంగా విచార‌ణ కోరాల్సింద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అలా చేయ‌కుండా కుట్ర చేస్తున్నార‌ని చెప్పి సానుభూతి పొందే ప్ర‌య‌త్నం చేయ‌డం స‌రికాద‌న్నారు. అస‌లు ఆ అమ్మాయి బండి సంజ‌య్‌ని క‌లిసిన విష‌యం వాస్త‌వమా? కాదా? ఆ అమ్మాయితో మీ కొడుకు తిరిగిన విష‌యం వాస్త‌వ‌మా? కాదా? అని ప్ర‌శ్నించారు. ఆ విష‌యాల‌ను నిరూపించి, నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల‌ని సూచించారు.

చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతుంద‌ని పొన్నం స్ప‌ష్టం చేశారు. ఇక్క‌డ ఎవ‌రిపై వివ‌క్ష చూపించేది లేద‌ని చెప్పారు. తెలంగాణ ఆడ‌బిడ్డ‌ల‌ను కాపాడే బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంద‌న్నారు. ఇలాంటి చ‌ర్య‌లు జ‌రిగితే ఆడ‌బిడ్ద‌ల‌కు ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని హామీ ఇచ్చారు. ఇక సామాజిక వ‌ర్గాన్ని రాజ‌కీయం చేయొద్ద‌ని, ఆ అమ్మాయి కూడా బండి సంజ‌య్ సామాజిక వ‌ర్గానికి చెందిన అమ్మాయేన‌ని చెప్పారు. మోదీ ప‌ర్య‌ట‌న వ‌ల్ల కొంత ఆల‌స్య‌మైంద‌ని, ఇప్పుడు విచార‌ణ కొన‌సాగుతుంద‌ని చెప్పారు. ఈ వ్య‌వ‌హారంలో ఎలాంటి ఒత్తిళ్ల‌కు త‌లొగ్గ‌కుండా విచార‌ణ చేయిస్తామ‌ని హామీ ఇచ్చారు. బండి సంజ‌య్‌ని ఎంపీగా గౌర‌విస్తామ‌ని, కానీ ఇలాంటి వ్య‌వ‌హారాల్లో విచార‌ణ జ‌ర‌గాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. విచార‌ణ జ‌ర‌గ‌కుండా అడ్డుప‌డితే ప్ర‌జాస్వామ్యం దాన్ని గౌర‌వించ‌ద‌ని వ్యాఖ్యానించారు. సీఎం ఆదేశాల మేర‌కు పోలీసులు పూర్తి స్థాయి విచార‌ణ చేప‌ట్టి దోషుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>