కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో కేరళలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) వ్యాఖ్యానించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉన్నంత వరకు ప్రజాస్వామ్యం ఉన్నంత మేరకు బీజేపీ కలలు కంటున్న కాంగ్రెస్ ముక్త్ భారత్ అసాధ్యమని బీజేపీపై మండిపడ్డారు. ప్రజాస్వామ్యాలకు వేదిక అయిన కాంగ్రెస్ పార్టీ దేశంలో మళ్ళీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం తప్పకుండా గెలుస్తుందని చెప్పారు. విభజన పేరుతో మతతత్వం పేరుమీద రాజకీయాలు చేయడమే శాశ్వతమని బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారని విమర్శించారు.
కేరళలో (Kerala) కాంగ్రెస్ కూటమి ఘన విజయం పట్ల ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ (KC Venugopal) నాయకత్వంలో సతీషన్, చేణితలకు అభినందనలు తెలియజేశారు. ఇతర రాష్ట్రాల ఫలితాలు గమనిస్తున్నామని.. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అధికారం కోసం అడ్డదారులు తొక్కలేదని స్పష్టం చేశారు. తాము ఓడినా.. గెలిచినా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల్లోనే ఉంటామని చెప్పారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి అవకాశం లేదని కొట్టిపారేశారు. తెలంగాణ ఏర్పాటు పట్ల తెలంగాణ విభజన పట్ల అవహేళనగా మాట్లాడిన వారిని తెలంగాణ ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. పగటి కలలు కంటూ బీజేపీ నేతల ప్రకటనలు చూస్తుంటే నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య రక్షణకు దేశ ప్రజలు తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారని పొన్నం (Ponnam Prabhakar) ధీమా వ్యక్తం చేశారు.
Read Also: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం చారిత్రాత్మకం: మోదీ
Follow Us On : WhatsApp

