Mobile Popup Ad
Mobile Popup Ad

అభివృద్ధి రథచక్రాల కింద సమిదలవుతున్న వృక్షాలు!

కలం, ఖమ్మం బ్యూరో : ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాలో అభివృద్ధి రథచక్రాల కింద పురాతన వృక్షాలు సమిదలవుతున్నాయి. ఒకప్పుడు ఇల్లందు, కారేపల్లితో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో కంటికి కనిపించినంత మేర పచ్చదనమే ఉండేది. కానీ, గడిచిన దశాబ్ద కాలంలో రహదారుల విస్తరణ, మైనింగ్ ప్రాజెక్టులు, పట్టణీకరణ పేరుతో వేలాది ఎకరాల అటవీ భూమి అంతరించి పోతుంది. ఖమ్మం నుంచి దేవరపల్లి వరకూ జరుగుతున్న జాతీయ రహదారి నిర్మాణాలు మొదలుకొని, మండల స్థాయిలో వేస్తున్న సర్వీస్ రోడ్ల కారణంగా, వేలాది వృక్షాలు నేలమట్టమవుతున్నాయి. వీటితో పాటు జిల్లాలో మైనింగ్, పారిశ్రామికీకరణ వల్ల కొత్తగూడెం, ఇల్లందు పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అటవీ భూములు కనుమరుగవుతున్నాయి. ఒక చెట్టును నరికితే పది మొక్కలు నాటాలనే నిబంధన ఉన్నా, అవి క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదు. దీంతో అడవుల లేదా చెట్ల నరికివేత పర్యావరణం పై ప్రభావం చూపడమే కాకుండా మొత్తం జీవ వైవిధ్యాన్నే దెబ్బ తీస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందుకు నిదర్శనమే ఖమ్మం నగరంలో పెరిగిపోతున్న కోతుల సంచారం. ఖమ్మం రోటరీనగర్‌లో కోతల సంఖ్య పెరిగిపోయి, ఇళ్లలోకి చేరడమే కాకుండా మనుషులపై కూడా దాడులు చేస్తుండటం గమనార్హం.

మరో పక్క ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకోవడంతో జిల్లాలోని పలు చోట్ల రైతులు, కూలీలు వడ దెబ్బకు మృత్యువాత పడుతున్నారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎండ వేడి తట్టుకోలేక వాహనాలలో అగ్ని ప్రమాదం సంభవించడంతో వాహనాలు దగ్దం అయిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 8,000 చ.కి.మీటర్లకు పైగా అటవీ విస్తీర్ణాన్ని కలిగి ఉండేది. ఇది జిల్లా మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో సుమారు 50 శాతం. అయితే రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏడు మండలాలను ఏపీలో కలిపారు. దీని వల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లా తన అటవీ విస్తీర్ణంలో కొంత భాగాన్ని కోల్పోయింది. మొత్తం మీద ఒకప్పుడు 50 శాతం ఉన్న అటవీ విస్తీర్ణం నేడు 35 శాతానికి పడిపోయింది. ఇందులో 25 శాతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉండగా కేవలం 10 శాతం మాత్రమే ఖమ్మం (Khammam) జిల్లాలో ఉండటం గమనార్హం.

ప్రమాదంలో గ్రీన్ బెల్ట్ గుర్తింపు

మొత్తం మీద ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఉన్న గ్రీన్ బెల్ట్ గుర్తింపు ప్రమాదంలో పడింది. అభివృద్ధికి ఎవ్వరూ వ్యతిరేకం కాదు. కానీ స్థిరమైన అభివృద్ధి లేకపోవడమే ప్రధాన సమస్య. ముఖ్యంగా చెట్లను వేళ్ళతో సహా పెకిలించి, వేరే చోట నాటే ట్రాన్స్ ప్లాంటేషన్ పద్ధతులను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదని పర్యావరణ వేత్తలు గగ్గోలు పెడుతున్నారు. అభివృద్ధి పేరుతో మనం వేస్తున్న రోడ్లు, కడుతున్న బిల్డింగ్‌లు, రేపటి తరానికి ప్రాణవాయువును అందించలేవు. ‘వృక్షో రక్షిత రక్షితః’ అన్న సూక్తిని విస్మరిస్తే, ఉమ్మడి ఖమ్మం జిల్లా తన సహజ సిద్ధమైన అందాన్ని, ఆరోగ్యాన్ని కోల్పోయి, కాంక్రీటు వనంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని విశ్లేషకులు అంటున్నారు. జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలను అరికట్టి, పర్యావరణంను పరిరక్షించాలంటే, ప్రభుత్వం, ప్రజలు కలిసి అటవీ రక్షణకు నడుం బిగించాల్సిందేనని ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పర్యావరణ ప్రేమికులు దొడ్డి కృష్ణయ్య పేర్కొన్నారు.

Read Also: టీవీకే చీఫ్​ విజయ్‌కు రాహుల్ గాంధీ ఫోన్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>