బీసీల సమగ్ర అభివృద్ధికి క‌ట్టుబ‌డి ఉన్నాం: మంత్రి పొన్నం ప్రభాకర్

క‌లం, వెబ్ డెస్క్‌: రాష్ట్ర జనాభాలో 56.36 శాతానికి పైగా బీసీలే ఉన్నార‌ని, వారి సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అసెంబ్లీలో ప్రకటించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను బీసీ సంక్షేమ శాఖకు ప్రభుత్వం రూ. 12,511.12 కోట్లను కేటాయించిందని ఆయన వెల్లడించారు. కుల గణన ద్వారా ఎవరి జనాభా ఎంత ఉంటే.. వారికి అంత వాటా అన్న రాహుల్ గాంధీ నినాదాన్ని నిజం చేస్తూ, సామాజిక న్యాయం అందించడమే సీఎం రేవంత్ రెడ్డి, ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారి సామాజిక, విద్య, జీవనోపాధి, ఆర్థిక ఎదుగుదలకు, వారి అభ్యున్నతికి బీసీ సంక్షేమ శాఖ కట్టుబడి ఉంద‌న్నారు.

మహాత్మా జ్యోతిబా ఫూలే చెప్పినట్లు, ఏ సమాజమైనా అభివృద్ధి సాధించాలంటే విద్యే ప్రధాన ఆయుధ‌మ‌ని మంత్రి పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పిన‌ట్లు విద్య ఉన్న కుటుంబాలే ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయ‌న్నారు. ఆ మహనీయుల ఆశయాల మేరకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంద‌ని చెప్పారు. ఈ నేప‌థ్యంలో బీసీ విద్యార్థుల అభ్యున్నతి కోసం విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నట్లు మంత్రి పొన్నం (Ponnam Prabhakar) తెలిపారు. గత పదేళ్లలో బీసీ గురుకులాలపై జరిగిన వ్యయం కంటే కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలోనే అత్య‌ధికంగా ఖ‌ర్చు చేస్తున్న‌ట్లు తెలిపారు. ఈ రెండేళ్లలోనే రూ.2,232 కోట్లు ఖర్చు చేశామని వెల్ల‌డించారు. రాష్ట్రవ్యాప్తంగా 79 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను మంజూరు చేయడమే కాకుండా, విద్యార్థుల డైట్ ఛార్జీలను 40 శాతం, కాస్మొటిక్ ఛార్జీలను 200 శాతం పెంచినట్లు తెలిపారు. విద్యార్థులకు అవసరమైన 20 రకాల వస్తువులతో కూడిన స్టూడెంట్ వెల్కమ్ కిట్‌ను వచ్చే విద్యా సంవత్సరం నుండి అందజేస్తామని, ఇందు కోసం బీసీ గురుకులాలకు రూ.3,010.02 కోట్లు ప్రతిపాదించినట్లు వివరించారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, హాస్టళ్ల సమర్థ నిర్వహణ, గురుకుల విద్యాలయాల స్థాపన వంటి కార్యక్రమాల ద్వారా బీసీల‌ సమగ్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోంద‌న్నారు. ప్రత్యేకంగా ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల కోసం పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాల ద్వారా పూర్తి స్థాయి సహకారం అందిస్తున్నామ‌న్నారు. బీసీ సంక్షేమ శాఖ రాష్ట్రవ్యాప్తంగా 704 హాస్టళ్లు, అందులో 389 ప్రీ మెట్రిక్, 315 పోస్ట్ మెట్రిక్ నిర్వహిస్తూ సుమారు 74,000కు పైగా విద్యార్థులకు ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తోంద‌ని తెలిపారు. గత ప్రభుత్వం పౌష్టికాహారం, విద్య అంశాలను నిర్లక్ష్యం చేసింద‌ని విమ‌ర్శించారు.

2026-27 ఆర్థిక సంవత్సరానికి బీసీ హాస్టళ్ల నిర్వహణ కోసం రూ.434.83 కోట్లు కేటాయించి విద్యా నాణ్యతను పెంపొందించడం, డ్రాప్‌అవుట్ రేటును తగ్గించడం, విద్యార్థులకు సురక్షితమైన, అనుకూల వాతావరణాన్ని కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమ‌న్నార‌. అలాగే బీసీ బాలికల విద్యాభివృద్ధి, భద్రతను దృష్టిలో ఉంచుకొని కొత్త భవనాల నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించిన‌ట్లు తెలిపారు.

ఉన్నత విద్యను ప్రోత్సహించే దిశగా విదేశీ విద్యానిధి లబ్ధిదారుల సంఖ్యను 300 నుండి 700కు పెంచామని మంత్రి తెలిపారు. బాలికల కోసం ప్రత్యేక కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుతో పాటు, 24 పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అభ్యాసాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. బీసీ భవనాల నిర్మాణానికి రూ.100 కోట్లు, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు రూ.1000 కోట్లు కేటాయించామని, కుల సంఘాల ద్వారా ఉపాధి కల్పనతో పాటు రాజీవ్ యువ వికాసం ద్వారా యువతకు అండగా ఉంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.

Read Also: ఐపీఎల్​ సీజన్​.. సీపీ సజ్జనార్​ కీలక విజ్ఞప్తి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>