కలం, వెబ్ డెస్క్ : మార్కెట్ క్లోజింగ్ ఆక్షన్ సెషన్లలో ఇప్పటివరకు ఎలాంటి మానిప్యులేషన్ గమనించలేదని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చైర్మన్ (SEBI Chairman) తుహిన్ కాంత పాండే స్పష్టం చేశారు. ముంబైలో ఆయన మాట్లాడుతూ, మార్కెట్ డేటాను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. గతంలో మ్యూచువల్ ఫండ్స్ భాగస్వామ్యం 5 నుండి 7 శాతం ఉండేదని, ప్రస్తుతం అది 20 నుండి 25 శాతానికి పెరిగిందని వివరించారు. ఎక్స్‌పైరీ రోజుల్లో ప్రొప్రైటరీ ట్రేడర్ల యాక్టివిటీ ఎక్కువగా ఉంటోందని, మార్కెట్ భాగస్వాములందరితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. సోషల్ మీడియా ద్వారా వచ్చే సూచనలను సైతం స్వాగతిస్తున్నామని వెల్లడించారు.
రిటైల్ ఇన్వెస్టర్ల నష్టాలపై స్పందిస్తూ, మరో 8 నుండి 10 రోజుల్లో సమగ్ర అధ్యయన పత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించారు. మార్కెట్లో కేవలం సాధారణ రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రమే కాకుండా అనుభవజ్ఞులైన పెద్ద ఇన్వెస్టర్లు సైతం నష్టపోతున్నారని తెలిపారు. షేర్ మార్కెట్లో లాభనష్టాలు అనేవి సహజమైన రిస్క్ అని చెప్పారు. ముఖ్యంగా ఎక్స్‌పైరీ రోజుల్లో ఆప్షన్స్ ట్రేడింగ్ అనుకున్నంత సులభం కాదని, సరైన అవగాహన లేకపోతే భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

