Mobile Popup Ad
Mobile Popup Ad

మొక్కజొన్న రైతుల ఆగ్రహం.. చింతకాని తహసీల్దార్ కార్యాలయం ముట్టడి!

​కలం, ఖమ్మం బ్యూరో: మొక్కజొన్న కొనుగోళ్లలో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఖమ్మం జిల్లా చింతకాని తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం రైతులు భారీ ఆందోళన చేపట్టారు. లారీల సరఫరా, ట్రక్ షీట్ల జారీలో జరుగుతున్న జాప్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యాలయాన్ని ముట్టడించారు. ​రైతుల కథనం ప్రకారం.. ఈ నెల 2వ తేదీన నాగులవంచ సహకార సంఘం నుంచి మొక్కజొన్న లోడుతో వెళ్లిన లారీలు, ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట గోదాముకు చేరుకున్నాయి. అయితే, అక్కడ అన్-లోడింగ్ ప్రక్రియ నిలిచిపోవడంతో గత 12 రోజులుగా లారీలు గోదాం బయటే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారుల మధ్య సమన్వయలోపం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని రైతులు మండిపడుతున్నారు.

నిలిచిపోయిన లారీలు

​గోదామువద్ద లారీలు సుదీర్ఘకాలం నిలిచిపోవడంతో లారీ యజమానులు, డ్రైవర్లు రైతులపై ఒత్తిడి పెంచుతున్నారు. రోజువారీ వెయిటింగ్ ఛార్జీలు చెల్లించాలని వారు పట్టుబడుతుండటంతో, పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కకముందే అదనపు ఖర్చులు భరించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి మొక్కజొన్న దిగుమతి అయ్యేలా చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

​రైతుల ఆందోళనతో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతుల నిరసనను గమనించిన చింతకాని సహకార సంఘం సీఈఓ తీవ్ర ఒత్తిడికి లోనై అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్పందించిన కార్యాలయ సిబ్బంది ఆయనను ప్రాథమిక చికిత్స నిమిత్తం చింతకాని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>