పొంగులేటి భావోద్వేగం.. ‘మోదీతో నాటి ప్రయాణం ఓ మధురానుభూతి!’

కలం, ఖమ్మం బ్యూరో: ​”కాలం మారింది.. కానీ దేశం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ అచంచలమైన నిబద్ధత, ఆయన అద్భుత దూరదృష్టి ఏమాత్రం మారలేదు. నాడు నాతో కలిసి నడిచిన నాయకుడు నేడు విశ్వగురువుగా ఎదిగి, దేశాన్ని నడిపిస్తుంటే.. ఆ మహాయజ్ఞంలో నేనూ ఒక సమిధను కావడం నా జీవితంలో అత్యంత గర్వకారణం” అని భారతీయ జనతా పార్టీ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సహ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి (Ponguleti Sudhakar Reddy) అత్యంత ఉద్వేగంగా ప్రకటించారు. ​ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి (PM Modi) ప్రతిష్టాత్మకమైన 32వ అంతర్జాతీయ పురస్కారం దక్కిన వేళ, పొంగులేటి సుధాకర్ రెడ్డి తన సంతోషాన్ని, దశాబ్దాల క్రితం నాటి మధుర జ్ఞాపకాలను పంచుకుంటూ ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు.

​ప్రధానికి దక్కిన ఈ అరుదైన అంతర్జాతీయ గౌరవం దేశ ప్రజలందరికీ గర్వకారణమన్న పొంగులేటి (Ponguleti Sudhakar Reddy).. దశాబ్దాల క్రితం నాటి ఒక అరుదైన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. 1993లో నరేంద్ర మోదీతో కలిసి ఒక ప్రతినిధి బృందంలో సభ్యుడిగా నేను అమెరికా పర్యటనలో పాల్గొన్నాను. నాటి నుంచి నేటి వరకు మోదీ నిబద్ధత చెక్కుచెదరలేదు. ఆ రోజుల్లో ఆయనతో కలిసి చేసిన పర్యటన నా జీవితంలోనే మరువలేని ఒక మధురానుభూతి అని పొంగులేటి పేర్కొన్నారు.

​ఆ రోజుకు, ఈ రోజుకు మధ్య కేవలం కాలం మాత్రమే మారిందని, దేశం పట్ల నరేంద్ర మోదీకి ఉన్న అంకితభావం, ఆలోచనా విధానం ఏమాత్రం మారలేదని పొంగులేటి స్పష్టం చేశారు. మోదీ ఆశయాలు ఎప్పటికీ దేశానికి దారిచూపే ధ్రువనక్షత్రంలా వెలుగుతూనే ఉంటాయని కొనియాడారు. ఆ మహోన్నత వ్యక్తిత్వమే ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత గౌరవాలు తెచ్చిపెడుతోందని ప్రశంసించారు. నాడు తనతో కలిసి ప్రయాణించిన నాయకుడు, నేడు విశ్వగురువుగా ఎదిగి ‘వికసిత భారత్’ కలను సాకారం చేసే దిశగా అడుగులు వేయడం ఒక విధేయుడైన కార్యకర్తగా తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందన్నారు.

​2040 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోనే తిరుగులేని మహాశక్తిగా నిలపాలని ప్రధాని మోదీ దృఢ సంకల్పంతో అహర్నిశలు శ్రమిస్తున్నారని సుధాకర్ రెడ్డి తెలిపారు. మోదీ చేపట్టిన ఈ దేశ నిర్మాణ మహా యజ్ఞంలో తాను సైతం ఒక సమిధగా పాల్గొంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. నరేంద్ర మోదీ తన నాయకుడు అని ప్రపంచానికి గర్వంగా చెబుతానని, దేశ ప్రగతి కోసం ఆయన పడుతున్న తపన, నిరంతర కృషిని చూసి ప్రతి భారతీయుడు గర్వపడాలని పొంగులేటి సుధాకర్ రెడ్డి ఉద్ఘాటించారు.

Read Also: కాంగ్రెస్‌లో కుంపటి.. ఎంపీ అరవింద్ కామెంట్లతో కొత్త చర్చ !

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>