కలం, వెబ్ డెస్క్: మ్యూజియాలు అనేవి కేవలం పురాతన వస్తువుల నిల్వ కేంద్రాలు మాత్రమే కావని.. అవి మన నాగరికత, సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాలు, జీవన విధానానికి అద్దం పట్టే జ్ఞాన కేంద్రాలు అని మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) అన్నారు. ప్రపంచ వారసత్వ సంపదను రక్షించడం అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. నేడు అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లోని రాష్ట్ర మ్యూజియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జూపల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో పరమార జగద్దేవుని శాసనాలు, స్టకో స్కప్చర్స్ ఇన్ సెంటెనరీ మ్యూజియం అనే పుస్తకాలతో పాటు బ్రోచర్లను ఆవిష్కరించి మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వారసత్వ సంపద పరిరక్షణ, మ్యూజియాల అభివృద్ధి, చారిత్రక కట్టడాల సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా జూపల్లి (Jupally Krishna Rao) చెప్పుకొచ్చారు. ఒక దేశ గొప్పతనం, నాగరికత, సంస్కృతి, సాంప్రదాయాలు అన్నీ మ్యూజియాలు, వారసత్వ సంపద ద్వారానే భావితరాలకు చేరుతాయని అభిప్రాయపడ్డారు. ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలు లేని కాలంలో అద్భుతమైన కట్టడాలను మన పూర్వీకులు నిర్మించారని చెప్పారు. వాటిని చూసి తరించకపోతే జీవితం సంపూర్ణం కాదని అన్నారు.
రామప్ప దేవాలయానికి (Ramappa Temple) ప్రపంచ వారసత్వ జాబితాలో స్థానం లభించడం తెలంగాణ చరిత్రకు అంతర్జాతీయ గుర్తింపును తీసుకువచ్చిందని పేర్కొన్నారు. ఈ వారసత్వ కట్టడాలను ప్రపంచానికి పరిచయం చేయడం ద్వారా తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక పటంలో మరింత ప్రతిష్టాత్మకంగా నిలపాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వరల్డ్ మన్యూమెంట్ ఫండ్ బోర్డు మెంబర్ షాలిని భూపాల్, పర్యాటక అభివృద్ధి సంస్థ మెనేజింగ్ డైరెక్టర్ గౌతమి, పర్యాటక శాఖ డైరెక్టర్ లక్ష్మణ్ రంజిత్ నాయక్, పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జున రావు, నిథమ్ డైరెక్టర్ వెంకటరమణ, కేంద్ర పురావస్తు శాఖ సూపరిన్టెండెంట్ నిఖిల్ దాస్, డెక్కన్ హెరిటేజ్ అకాడమీ చైర్మన్ వేద కుమార్, ఇంటాచ్ (INTACH) కన్వీనర్ అనురాధ రెడ్డి, చరిత్రకారులు డా. ఈమని శివనాగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Read Also: కాంగ్రెస్‌లో కుంపటి.. ఎంపీ అరవింద్ కామెంట్లతో కొత్త చర్చ !
Follow Us On: WhatsApp

