Mobile Popup Ad
Mobile Popup Ad

లేటెస్ట్ సెన్సస్ ప్రాతిపదికగా డీలిమిటేషన్

కలం, నేషనల్ డెస్క్ : లోక్‌సభ, అన్ని రాష్ట్రాల్లోని శాసనసభ స్థానాలను పునర్ విభజించడానికి కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ (Delimitation) కసరత్తు మొదలుపెట్టింది. ఈ నెల 16 నుంచి మూడు రోజుల పాటు జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టనున్నది. ఉభయ సభల్లో చర్చల అనంతరం ఆమోదం పొందడంతో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు కానున్నది. లోక్‌సభ స్థానాలను 850కు పెంచేలా ఇప్పటికే ముసాయిదా బిల్లు రెడీ అయింది. ఈ సీట్ల సంఖ్యను పెంచడానికి అనుసరించాల్సిన విధానాన్ని డీలిమిటేషన్ కమిషన్ ఖరారు చేస్తుంది. కేంద్రం ప్రవేశపెట్టే బిల్లు ఆమోదం పొందిన వెంటనే రాష్ట్రపతి అప్రూవల్‌తో చట్టబద్ధత లభిస్తుంది. దీని ఆధారంగా డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటవుతుంది. కమిషన్ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అవసరమైతే ఆ పదవీకాలాన్ని పొడిగించడంపైనా కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది.

డీలిమిటేషన్ కమిషన్‌లో ఎవరెవరుంటారు? :

డీలిమిటేషన్ కమిషన్‌కు చైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉంటారు. కేంద్ర ప్రభుత్వం ఆ జడ్జిని ఖరారు చేస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ లేదా ఆయన సిఫారసుతో ఒక ఎన్నికల కమిషనర్ ఇందులో సభ్యులుగా ఉంటారు. ఇక ప్రతీ రాష్ట్రానికి చెందిన ఎన్నికల కమిషనర్ (స్టేట్ ఎలక్షన్ కమిషనర్) సభ్యులుగా ఉంటారు. కానీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎక్స్-అఫీషియో సభ్యులుగా మాత్రమే ఉంటారు. ఆయా రాష్ట్రాల్లోని లోక్‌సభ స్థానాలు, శాసనసభ స్థానాలను డీలిమిటేషన్ చేసే ప్రక్రియంలో కమిషన్ సభ్యులకు సహాయం చేయడానికి ప్రతీ రాష్ట్రం నుంచి ఐదుగురు లోక్‌సభ సభ్యులు, ఐదుగురు ఎమ్మెల్యేలు అసోసియేట్ సభ్యులుగా ఉంటారు. కానీ కమిషన్ తీసుకునే నిర్ణయాల్లో వీరికి ఓటింగ్‌లో పాల్గొనే అధికారం ఉండదు. చర్చల్లో మాత్రమే పాల్గొని వారి అభిప్రాయాలను ఇవ్వగలుగుతారు.

లేటెస్ట్ సెన్సస్ ఆధారంగా నియోజకవర్గాలు ఖరారు :

నియోజకవర్గాల పునర్ విభజనకు (డీలిమిటేషన్) లేటెస్ట్ సెన్సస్ (జనాభా లెక్కలు)ను డీలిమిటేషన్ కమిషన్ పరిగణనలోకి తీసుకుంటుంది. జనాభాకు అనుగుణంగా లోక్‌సభ, శాసనసభ నియోజకర్గాల సరిహద్దులను తిరిగి నిర్ణయించే ప్రక్రియను ఈ కమిషన్ చేపడుతుంది. దేశంలోని ఓటర్లందరికీ సమాన ప్రాతినిధ్యం ఉండేలా ఈ కమిషన్ చూస్తుంది. డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటయ్యే సమయానికి ఏ జనాభా లెక్కలు లేటెస్టుగా ఉంటే వాటినే ఈ కమిషన్ పరిగణనలోకి తీసుకుంటుంది. ప్రస్తుతానికి 2011 జనాభా లెక్కలు మాత్రమే పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. 2027 డిజిటల్ సెన్సస్ ప్రక్రియ ఇంకా పూర్తికానందున, లెక్కల నివేదిక ప్రభుత్వానికి చేరనందున దీన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదు. గతంలో 2001 జనాభా లెక్కల ఆధారంగా లోక్‌సభ, శాసనసభ నియోజకర్గాల సరిహద్దులను డీలిమిటేషన్ కమిషన్ ఖరారు చేసింది. కానీ సంఖ్య మాత్రం మారలేదు.

రొటేషన్ పద్ధతిలో మహిళా రిజర్వేషన్ :

డీలిమిటేషన్ (Delimitation) ఎక్సర్‌సైజ్‌తో పాటు మహిళలకు మొత్తం సీట్లలో మూడవ వంతు రిజర్వు కానున్నది. వెంటనే ఈ విధానం అమల్లోకి రానున్నది. ప్రతీ డీలిమిటేషన్‌కు ఒకసారి మహిళలకు రిజర్వు చేసిన స్థానాలు రొటేషన్ పద్ధతిలో మారుతూ ఉంటాయి. ఒక డీలిమిటేషన్ కాలవ్యవధిలో ఒక నియోజకవర్గం మహిళలకు రిజర్వు అయినట్లయితే మరో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పడి నియోజవర్గాల పునర్ విభజన చేసేంత వరకు ఆ నిర్దిష్ట నియోజకవర్గం మహిళకే రిజర్వు అవుతుంది. రెండో డీలిమిటేషన్ ఖరారు చేసిన తర్వాత మరో నియోజకవర్గం మహిళలకు రిజర్వు అవుతుంది. ఆ ప్రకారం ఒక డీలిమిటేషన్ కమిషన్ ఉనికిలో ఉన్నంతవరకు మహిళలకు రిజర్వు చేసిన నియోజకవర్గం ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతుంది. గరిష్టంగా 15 సంవత్సరాలు మహిళలకు ఆ నియోజకవర్గం రిజర్వు అయ్యేలా ముసాయిదా బిల్లులో కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది.

Read Also: కేటీఆర్ పాదయాత్ర.. కేసీఆర్ భిన్నాభిప్రాయం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>