పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట: మంత్రి పొంగులేటి

కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్రంలోని పేద ప్రజల అభివృద్ధి సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని, అందులో భాగంగా అనేక కార్యక్రమాలు చేపడుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivasa Reddy) స్పష్టం చేశారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గంలోని దుమ్ముగూడెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు చేశారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికి చేరేలా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని మంత్రి పేర్కొన్నారు.

యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపన

ముందుగా దుమ్ముగూడెం మండలం బండిరేవు గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామీణ, గిరిజన ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన, సమగ్ర విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నదన్నారు. యంగ్ ఇండియా పథకం కింద నిర్మించనున్న ఈ రెసిడెన్షియల్ పాఠశాల ద్వారా విద్యార్థులకు విద్యతో పాటు వసతి, పోషకాహారం, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి వంటి అన్ని సౌకర్యాలు ఒకే ప్రాంగణంలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఆధునిక తరగతి గదులు, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్‌లు, గ్రంథాలయం, క్రీడా మైదానాలు, హాస్టల్ వసతులతో ఈ విద్యాసంస్థ నిర్మించబడుతుందని పేర్కొన్నారు. ఈ పాఠశాల నిర్మాణం పూర్తయిన అనంతరం స్థానికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చి వారి భవిష్యత్తుకు బలమైన పునాది ఏర్పడుతుందని తెలిపారు.

బీటీ రోడ్డు పనులు ప్రారంభం

అనంతరం దుమ్ముగూడెం మండలంలోని చింతగుప్ప గ్రామం నుండి బురదమడుగు వరకు బీటీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సదుపాయాలను విస్తృతంగా అభివృద్ధి చేయడం ద్వారా గ్రామాల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయడమే కాకుండా ప్రజల రాకపోకలకు సౌలభ్యం కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఈ రహదారి పూర్తయిన తర్వాత చింతగుప్ప, బురదమడుగు గ్రామాల మధ్య రాకపోకలు సులభతరం కావడంతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు గణనీయమైన ఉపయోగం ఉంటుందని పేర్కొన్నారు.

కలెక్టర్‌తో కలిసి షటిల్ ఆడిన మంత్రి

ములకపాడు గ్రామంలోని మినీ స్టేడియంలో 400 మీటర్ల అథ్లెటిక్ ట్రాక్‌తో కూడిన మినీ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. తదుపరి అక్కడ ఏర్పాటు చేసిన బ్యాడ్మింటన్ కోర్టులో మంత్రి, కలెక్టర్ కలిసి షటిల్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా మంత్రి మినీ ఇండోర్ స్టేడియంలో కల్పించిన సదుపాయాలను జిల్లా కలెక్టర్ అంకిత్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామీణ యువతలో క్రీడా చైతన్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల లబ్ధి చేకూరేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు కూడా అభివృద్ధి ఫలాలు చేరేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా పేదలకు గృహ సౌకర్యాలు కల్పిస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నామని, మొదటి విడత విజయవంతంగా పూర్తయిందని, రెండో విడతను త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

పారదర్శకంగా కొనుగోళ్లు

రైతుల సంక్షేమంపై మాట్లాడుతూ ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లను పారదర్శకంగా నిర్వహిస్తూ వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని తెలిపారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిని సమగ్రంగా ముందుకు తీసుకెళ్లే దిశగా రహదారులు, విద్య, ఆరోగ్యం, క్రీడా రంగాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ చర్యలు తీసుకుంటోందని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను దశల వారీగా అందిస్తూ సమగ్ర అభివృద్ధి సాధనలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ.. దుమ్ముగూడెం మండలంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. యంగ్ ఇండియా పాఠశాల, రహదారి, క్రీడా వసతుల అభివృద్ధి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విద్య, రవాణా, క్రీడా రంగాల్లో పురోగతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు నిజంగా పేదల జీవితాల్లో మార్పు తీసుకువస్తున్నాయని పునరుద్ఘాటించారు.

జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ.. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం ద్వారా జిల్లాలో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ పాఠశాలలో సుమారు 2,000 నుండి 2,500 మంది విద్యార్థులు ఒకేచోట విద్యనభ్యసించే అవకాశం కల్పించబడుతుందని తెలిపారు. అలాగే ధాన్యం కొనుగోలు ప్రక్రియ జిల్లాలో వేగవంతంగా కొనసాగుతోందని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరిపేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని వివరించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలలో ఎస్‌పి రోహిత్ రాజు, ఐటీడీఏ పీవో రాహుల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణల్ శ్రేష్ఠ సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>