కలం, తెలంగాణ బ్యూరో: ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి స్పష్టమైన విధానమున్నదని, అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకున్న మొదటి నిర్ణయం ఉద్యోగులకు సంబంధించినదేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. ఫస్ట్ తారీఖునే జీతాలు చెల్లించాలన్న నిర్ణయం అందులో భాగమేనని వివరించారు. ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రకటించినా ఉద్యోగులు భుజాన వేసుకుని పనిచేశారని గుర్తుచేశారు. వారి సహకారంతోనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయన్నారు. ఉద్యోగ సంఘాల జేఏసీ, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ప్రతినిధులతో శనివారం జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి కొన్ని స్పష్టమైన నిర్ణయాలను ప్రకటించారు. వంద రోజుల్లో ఆరు వేల కోట్ల రూపాలను ప్రభుత్వం విడుదల చేస్తుందని, దీన్ని ఉద్యోగుల రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కోసం ఖర్చు చేసుకోవచ్చని తెలిపారు. ప్రాధాన్యతను ఉద్యోగ సంఘాలే నిర్ణయించాలన్నారు.
పీఆర్సీ రిపోర్టు రాగానే ఫిట్‌మెంట్‌పై నిర్ణయం :
ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి పీఆర్సీ కమిషన్ నుంచి వెంటనే నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించామని, అది రాగానే స్టడీ చేసి ఫిట్‌మెంట్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. ఉద్యోగులందరికీ జూన్ 1వ తేదీలోగా ఆరోగ్య భద్రతా కార్డులను పంపిణీ చేస్తామన్నారు. ఉద్యోగ సంఘాలు స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించుకునేలా ఈ ప్రభుత్వం అవకాశం కల్పించిందని గుర్తుచేశారు. ప్రతీ రెండు నెలలకోసారి గుర్తింపు సంఘాలు సమావేశమై సమస్యలపై ప్రభుత్వానికి రిపోర్టు అందించాలన్నారు. ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే బాధ్యత తమదని నొక్కిచెప్పారు. ఉద్యోగుల బదిలీల విషయంలో గందరగోళం తలెత్తకుండా ప్రణాళిక ప్రకారం నిర్వహించామన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న టీచర్ల బదిలీలను ఎలాంటి వివాదం లేకుండా పూర్తిచేశామన్నారు.
రెండేండ్లలో 67 వేల ఉద్యోగాల భర్తీ కంప్లీట్ :
ప్రజా ప్రభుత్వం ఏర్పడగానే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్లు ఇచ్చి 67,760 ఉద్యోగాల నియామకాలను పూర్తి చేశామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఉద్యోగులు లేవనెత్తిన ఆరోగ్య భద్రత కార్డుల ప్రతిపాదనపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. గత ప్రభుత్వంలో వివిధ రకాల బకాయిలు పేరుకుపోయాయని, అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి చాలా సమయం పట్టిందని, ఇప్పటికీ కొన్నింటిని సరిదిద్దే ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నదన్నారు. గత ప్రభుత్వ అప్పులు, వాటి మీద వడ్డీలను తీర్చడానికి రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో గణనీయంగా వెచ్చించాల్సి వస్తున్నదని, వీటిని చూసుకుంటూనే ఉద్యోగుల అవసరాలను, సంక్షేమ పథకాలకు ఆర్థిక వనరులను సిద్ధం చేస్తున్నామన్నారు. ఉద్యోగుల నుంచి ప్రభుత్వానికి అందుతున్న సహకారం ఇకపైన కూడా ఇదే తరహాలో కొనసాగుతుందన్న ఆశాభావాన్ని సీఎం వ్యక్తం చేశారు.
సమస్యలకు పరిష్కారం చూపడంపై కృతజ్ఞతలు :
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను మంచి వాతావరణంలో పరిష్కరించినందుకు ముఖ్యమంత్రికి, డిప్యూటీ సీఎంకు ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగ సంఘాలకు గతంలో నామినేటెడ్ పద్ధతిలో కార్యవర్గం ఏర్పటయ్యేదని, తొలిసారి ఎన్నికల ద్వారా ఉద్యోగులు ఎన్నుకోవడాన్ని ప్రతినిధులు గుర్తుచేసుకున్నారు. గతంలోని చాలా సమస్యలను ప్రభుత్వం పరిష్కరించిందని వివరించారు. వైద్య విధాన పరిషత్‌లో 13,100 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని కితాబునిచ్చారు. పీఆర్సీ, హెల్త్ కార్డుల సమస్యలతోపాటు ఉద్యోగ సంఘాల ఇతర డిమాండ్లను పరిష్కరించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
Read Also: ప్రజల వద్దకే పాలన.. ప్రతి వినతికి న్యాయం చేస్తాం: పొంగులేటి
Follow Us On: Instagram

